
డ్రగ్స్ కేసు: ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు
హైదరాబాద్: డ్రగ్స్ మాఫియాతో సంబంధం ఉన్న విద్యార్థులను తాము ఇబ్బందిపెట్టబోమని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ తెలిపారు. డ్రగ్స్ సరఫరా చేయటంతోపాటు వినియోగించే విద్యార్థులు, ఆయా విద్యాసంస్థల వారి నుంచి అవసరమైన మేర సమాచారం రాబడతామన్నారు.
కాగా, ఈ కేసులో బుధవారం హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల నిర్వాహకుడు బెండెన్ బెన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు వివరించారు. దీంతో మొత్తం 8 మందిని అరెస్ట్ చేసినట్లయిందన్నారు. బెండెన్ బెన్, నిఖిల్ షెట్టి కలిసి డ్రగ్స్ వ్యాపారం నడుపుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా 27 కళాశాలలు, 26 స్కూళ్లతోపాటు పలు ప్రైవేట్ కంపెనీలకు నోటీసులు జారీ చేశామన్నారు. సినీ పరిశ్రమ, వాణిజ్య ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చామన్నారు. ఈ విషయంలో ఎవరైనా తెలిసిన సమాచారం అందించాలనుకునేవారికి టోల్‌ఫ్రీ నంబర్ (1800 425 2523) కూడా అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. దీంతోపాటు ఈనెల 14వ తేదీన 83 స్కూళ్ల యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.