డీఎస్సీ పాసై చేపలమ్ముకుంటున్నా
* పోస్టింగ్ ఎప్పుడిస్తారు?: సీఎంను ప్రశ్నించిన మత్స్యకార యువకుడు
విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం విశాఖపట్నంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న చేపల మార్కెట్‌కెళ్లి చేపలు విక్రయిస్తున్నవారితో మాట్లాడారు. చేపలమ్ముకుంటున్న ఓ యువకుడితో.. 'ఏం బాబూ.. మీ సమస్యలేంటీ?' అని అడిగారు. దీంతో త్రినాథ్ అనే మత్స్యకార యువకుడు తన కష్టాన్ని వివరించాడు. 'సార్..2014లో డీఎస్సీ క్వాలిఫై అయ్యాను. 45వ ర్యాంకు సాధించాను.
కానీ ఇంతవరకూ పోస్టింగ్ ఇవ్వకపోవడంతో బతుకు తెరువుకోసం ఇలా చేపలు అమ్ముకుంటున్నాను. నాకు ఉద్యోగం ఎప్పుడిస్తారు సార్?' అంటూ నిలదీశాడు. కంగుతిన్న చంద్రబాబు స్పందిస్తూ.. 'అందరూ గవర్నమెంట్ ఉద్యోగమే కావాలంటే ఎలాగయ్యా.. ప్రైవేట్ సెక్టార్‌లోనూ అవకాశాలున్నాయికదా..అయినా వారంరోజుల్లో డీఎస్సీ పోస్టింగ్‌లిచ్చే ఏర్పాటు చేస్తున్నాం..సరేనా' అని అన్నారు.