ఈ చిన్నారిని ఆదుకొండి
రామాయంపేట (మెదక్ ): మాటలు రాని ఈ చిన్నారిని ఆదుకోవాలని మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన ఆమె తాత నందు వెంకట్రాంరెడ్డి అధికారులకు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెలితే... గ్రామానికి చెందిన రాజు, భాగ్య దంపతులకు ఇద్దరు ఆడపిల్లలే. వీరిలో పెద్ద పాప విజ్ఞేత (9) పుట్టినప్పటి నుంచి మూగ. దీనితో ఆమె తల్లిదండ్రులు తమ కూతురును ఎన్నో ఆసుపత్రుల్లో చూపించినా ఫలితంలేదు.
రాజు కూలీ పనులు చే స్తూ తన కుటుంబంతోపాటు వృద్దులైన తన తల్లిదండ్రులను పోషిస్తున్నాడు. కాగా విజ్ఞేతకు పింఛన్ సైతం రావడంలేదని వారు ఆవేధన వ్యక్తం చేశారు. కాగా జిల్లా కలెక్టర్ శనివారం గ్రామానికి రాగా ఆమె తాత, నానమ్మ తమ మనుమరాలిని కలెక్టర్ వద్దకు తీసుకొచ్చారు. తమ మనుమరాలికి వికలాంగుల కోటాలో పింఛన్ ఇప్పించి ఆదుకోవాలని వారు కలెక్టర్‌ను వేడుకున్నారు. విజ్ఞేతను తీసుకొని జిల్లా కేంద్రమైన మెదక్‌లో జరిగే సదరం క్యాంపునకు హాజరై డాక్టర్ సర్టిఫికెట్ పొందితే పింఛన్ వస్తుందని కలెక్టర్ వారికి సూచించారు.