ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు | duplicate employ in ggh | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు

Published Fri, Nov 11 2016 10:34 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 PM

duplicate employ in ggh

ప్రభుత్వ వైద్యశాలలో బినామీ ఉద్యోగులు
 
  •  విధులు నిర్వహిస్తూ పట్టుబడ్డ బయటి వ్యక్తులు
  •  రోగి బంధువుల నుంచి డబ్బులు వసూలు చేయడంతో వెలుగులోకి
  •  8 నెలలుగా సాగుతున్న తంతు
 
గుంటూరు మెడికల్‌: ఎవరు సిబ్బంది..ఎవరు కాదో కూడా తెలియని స్థితిలో గుంటూరు జీజీహెచ్‌ ఉంది. ప్రై వేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా తిరుగుతూ తమ పని కానిచ్చేస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు. రెండునెలల క్రితం బయట ల్యాబ్‌ వ్యక్తి జీజీహెచ్‌కు వచ్చి రక్తపు శాంపిళ్ళు తన ల్యాబ్‌కు తరలిస్తూ పట్టుబడ్డాడు. ఇది మరువక ముందే ఆస్పత్రి ఉద్యోగికి బదులు బయట వ్యక్తి విధులను నిర్వహిస్తున్న ఘటన శుక్రవారం వెలుగుచూసింది. వివరాలలోకి వెళితే...
  వడ్లమూడి గ్రామానికి చెందిన వాసుభక్త శ్రీను అనే వ్యక్తికి పక్షవాతం రావటంతో చికిత్స కోసం ఈనెల 9న కుటుంబ సభ్యులు గుంటూరు జీజీహెచ్‌లో చే ర్పించారు. ఆస్పత్రి ఇన్‌పేషెంట్‌ విభాగంలోని 329 నెంబర్‌ గదిలో శ్రీనుకు వైద్యులు పరీక్షలు చేసి శుక్రవారం  సీటీ స్కాన్‌ చేయించమని చెప్పారు. స్కానింగ్‌ గది వద్దకు రోగిని తీసుకెళ్ళేందుకు కరుణాకర్, తమ్మిశెట్టి మణికంఠ అనేవారు వచ్చి శ్రీను భార్య లక్ష్మి వద్ద రూ.400 డిమాండ్‌ చేశారు. తన వద్ద అన్ని డబ్బులు లేవని రూ.250లు ఇచ్చింది. డబ్బులు తీసుకున్న వారు ఇరువురు స్కానింగ్‌ గది వద్దకు రోగిని తీసుకు వెళ్లి అక్కడే స్ట్రెచర్‌ను వదిలివచ్చారు. డబ్బులు తీసుకుని కూడా వార్డుకు తీసుకెళ్ళకుండా రోగిని స్కానింగ్‌ గది వద్దే వదిలి వెళ్ళటంతో లక్ష్మి లిఖిత పూర్వకంగా ఆర్‌ఎంఓ డాక్టర్‌ యనమల రమేష్‌కు సదరు వ్యక్తులపై ఫిర్యాదు చేసింది. ఆయన వారిని పిలిచి విచారించగా అసలు వారు ఆస్పత్రి ఉద్యోగులే కాదని తెలిసింది. ఆస్పత్రిలో నాల్గోతరగతి ఉద్యోగి(ఎంఎన్‌ఓ)గా పనిచేస్తున్న దుర్గం శివయ్య ఎనిమిది నెలలుగా తాను విధులు నిర్వహించకుండా తన స్థానంలో ప్రై వేటు వ్యక్తి తమ్మిశెట్టి మణికంఠను నియమించాడు. మణికంఠ  కరుణాకర్‌తో కలిసి పనిచేస్తున్నాడు. తన విధులను నిర్వహిస్తున్న  మణికంఠకు నెలకు రూ.5,000ల చొప్పున శివయ్య చెల్లిస్తుండగా..మణికంఠ తనకు వచ్చిన డబ్బుల్లో కొంత మొత్తం కరుణాకర్‌కు ఇస్తున్నాడు. శుక్రవారం ఆర్‌ఎంఓ విచారించగా వీరిరువురూ రోగుల వద్ద కొంత కాలంగా ఇదే తరహాలో అధిక మొత్తంలో డబ్బులు డిమాండ్‌ చేసి తీసుకుంటున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆర్‌ఎంఓ డాక్టర్‌ రమేష్‌ జీజీహెచ్‌ ఉద్యోగి శివయ్య, ప్రై వేటు వ్యక్తులు మణికంఠ, కరుణాకర్‌లపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆస్పత్రి ఉద్యోగి పనిచేయకుండా బయట వ్యక్తులు వచ్చి పనిచేస్తూ డబ్బులు సైతం తీసుకుంటున్నా సార్జంట్‌లు  ఏం చేస్తున్నారంటూ ఆర్‌ఎంఓ ప్రశ్నించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని సార్జంట్‌ కాంతారావు, శ్రీహరిలను ఆదేశించారు.  కాగా,  సీసీ కెమెరాలు... సెక్యూరిటీ సిబ్బంది... గేట్‌పాస్‌ విధానం అమలులో ఉన్నా పెద్దాసుపత్రిలో ఇలాంటి సంఘటనలు తరచుగా చోటు చేసుకోవటం అధికారుల పనితీరును తెలియచేస్తోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement