- ఆర్పీ బయో 226 వరి వంగడం సాగుతో
- 30 శాతానికిపైగా దిగుబడి నష్టం
- ఏపీ సీడ్ విత్తనాల్లో సగం వరకూ కల్తీ
- ఈనిక దశలో కేళీలు ప్రత్యక్షం
- లబోదిబోమంటున్న రైతులు
‘బయో’త్పాతం
Published Thu, Oct 6 2016 11:14 PM | Last Updated on Mon, Sep 4 2017 4:25 PM
వరమివ్వాల్సిన వారే శపించిన చందంగా వ్యవసాయ శాఖ అధికారులు చేతుల మీదుగా పంపిణీ చేసిన విత్తనాలే నష్టాల బాటలోకి నెట్టేశాయి. అన్నీ పరిశోధించి ... పరిశీలించి ఇచ్చిన విత్తనాలన్న ధీమాతో సాగు చేస్తే కేళీగా మారి రైతన్న బతుకులను ఎగతాళి చేశాయి. నష్టాల్లో ఉన్న కర్షకులను మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. ఎకరాకు సగం పంట కూడా రాకపోవడంతో ఏం చేయాలో తెలియక అన్నదాతలు అయోమయంలో పడ్డారు.
రాజమహేంద్రవరం రూరల్/జగ్గంపేట :
వ్యవసాయశాఖ రాయితీపై సరఫరా చేసిన వరి విత్తనాలు రైతులను నట్టేటా ముం చాయి. బీపీటీ 5204 (బొండాలు)కు ప్రత్యామ్నాయంగా రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ (ఏపీ సీడ్స్) సొసైటీల ద్వారా సరఫరా చేసిన ఆర్‌పీబయో 226 వరి రకానికి కేళీల సమస్య
ఉత్పన్నమైంది. ఇది దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. ఈ రకానికి సుమారు ఐదు నుంచి ఆరు రకాల సంకర జాతి విత్తనాలు తోడవడంతో ఈనిక దశలో వెన్నులు కాక కేళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వ్యవసాయ అధికారుల సూచనలతోనే...
చంద్రన్న వ్యవసాయ ప్రదర్శన క్షేత్రాలు ద్వారా రైతులకు బీపీటీ 5204కు బదులుగా ఆర్‌పీ బయో 226 వరి రకాన్ని వేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు సూచించారు. ఏపీ సీడ్స్ ద్వారా 1044.90 క్వింటాళ్ల విత్తనాలను జిల్లాలోని రైతులకు సరఫరా చేశారు. జగ్గంపేట, రంగంపేట, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, పిఠాపురం, రాజమహేంద్రవరం రూరల్, జగ్గంపేట మండలాల్లో రైతులు ఈ విత్తనాలతో సాగు చేపట్టారు. ప్రస్తుతం ఈనిక దశలో ఉన్న పంటలో వెన్నులు కాక కేళీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కేళీలు 20 నుంచి 25 శాతం ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నా రైతులు మాత్రం 50 శాతంపైనే ఉంటుందన్నారు. పంట చేతికి వచ్చినా కేళీలు ఎక్కువగా ఉండడంతో ధాన్యాన్ని కొనేవారు ఉండరన్నారు. రాజమహేంద్రవరం రూరల్, యు.కొత్తపల్లి, గొల్లప్రోలు, రంగంపేట, జగ్గంపేట, గండేపల్లి, ప్రత్తిపాడు, ఏలేశ్వరం మండలాల్లో ఇవి అధికంగా ఉన్నాయి. కేజీకి రూ.5 సబ్సిడీ చొప్పున రైతులకు రాయితీగా ఈ రకాన్ని జగ్గంపేట మండలంలోని మెట్టప్రాంతంలో తదితర ప్రాంతాల రైతులకు అందజేశారు. ఒక్క జగ్గంపేట వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 167 ఎకరాల్లో ఈ విత్తనంతో సాగు చేశారు. పండిన పంటలో సగం వరకు కేళి ఉండడంతో తాము మోసపోయామని రైతులు ఆందోళన చెందుతున్నారు. అసలైన ఆర్పీ బయో చేను మాత్రం ప్లవరింగ్ దశలోనే ఉన్నాయని, నకిలీలతో మోసపోయామని రైతులు వాపోతున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఆర్‌పీబయో 226 వరి రకాన్ని మూడు ఎకరాల్లో సాగుచేశాను. పొలంలో 50 శాతానికి పైగా కే ళీలు ఉన్నాయి. ప్రభుత్వమే రైతులకు నష్టపరిహారం అందించి ఆదుకోవాలి.
– సుంకవల్లి అప్పారావు, రైతు, తొర్రేడు
ఎకరాకు రూ.15వేలు వరకు నష్టం...
వ్యవసాయ శాఖ అధికారుల ప్రోత్సహంతో ఏపీ సీడ్ నుంచి ఆర్పీ బయో 226 వరకు వరి వంగడం విత్తనాలను తీసుకునే సాగు చేశాం. కేళి సగం వరకు ఉంది. ఇది పనికిరాదు. ఇప్పటికే రూ.15వేలు వరకు ఎకరాకు పెట్టుబడులు పెట్టాం. కోతలు పూర్తయ్యేందుకు మరో రూ.10 వేలు అవసరమవుతాయి. కల్తీ విత్తనాలు కాకుండా రూ.15 వేల నుంచి 20 వేల వరకు నష్టపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదుకోవాలి.
– జాస్తి వీరభద్రరావు, రైతు, కాట్రావులపల్లి.
దిగుబడి తగ్గే అవకాశం...
ఆరు ఎకరాల్లో ఆర్‌పీ బయో వరిరకాన్ని సాగుచేశాం. ఎకరానికి రూ.37 వేలు ఖర్చు అయ్యింది. కేళీల కారణంగా దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. వ్యవసాయాధికారులే రైతులకు నష్టపరిహారం అందించాలి.
– కొత్తపల్లి రామకృష్ణ, కౌలురైతు, తొర్రేడు
రైతులు చెప్పింది నిజమే
ఆర్పీ బయో 226 రకం వరి విత్తనాలను ఏపీ సీడ్ ద్వారా రైతులకు అందజేశాం. ప్రస్తుతం చేను బాగుంది. కల్తీ ఎక్కువగా ఉండడంతో కేళి కనిపిస్తుంది. దీనిపై మార్టేరు శాస్త్రవేత్తల బృందం పరిశీలించారు. 30 శాతానికిపైగా కేళీ ఉన్నట్టు వారు తెలిపారు. రైతులను ఆదుకునేందుకు ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు చేస్తున్నాం.
– ఎల్.రాంబాబు, వ్యవసాయాధికారి, జగ్గంపేట
Advertisement