విత్తనాలకూ నకిలీ మకిలి
విత్తనాలకూ నకిలీ మకిలి
Published Sat, Oct 15 2016 11:25 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM
– మొలకెత్తని మినుములు
– కల్తీ వరి విత్తనాలతో రైతులకు నష్టం
– ఏపీ సీడ్స్ నిర్వాకం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
రాష్ట్రవ్యాప్తంగా సాగుతున్న నకిలీ విత్తనాల మకిలి మన జిల్లానూ తాకింది. ప్రస్తుత రబీ సీజన్‌లో మెట్టప్రాంతంలో వేసిన మినుము విత్తనాలు మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఏపీ సీడ్స్ సరఫరా చేసిన వరి విత్తనాల్లో వేరే రకం (కేళీలు) కలిసిపోవడంతో రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. పెదవేగి మండలంతోపాటు ఏలూరు రూరల్, దెందులూరు మండలాల్లో ఏపీ సీడ్స్ సరఫరా చేసిన విత్తనాలు కల్తీవి కావడంతో రైతులు నష్టపోయే పరిస్థితి తలెత్తింది. పెదవేగి మండలం అమ్మపాలెంలో సుమారు 300 ఎకరాల్లో కల్తీ వరి విత్తనాల వల్ల రైతులు నష్టపోయారు. ఏలూరు, దెందులూరు మండలాల్లో మరో మూడు వందల ఎకరాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఖరీఫ్‌లో వాడే ఎంటీయూ–1001 రకం విత్తనాల్లో రబీలో వాడే ఎంటీయూ–1010 విత్తనాలు కలిసిపోవడంతో రైతులకు నష్టం కలుగుతోంది. ఏపీ సీడ్స్ నుంచి రైతులు ఎంటీయూ–1001 రకం, బీపీటీ రకం వరి విత్తనాలను కొనుగోలు చేశారు. వీటిలో ఎంటీయూ–1010 రకం విత్తనాలు కలిసిపోయాయి. కల్తీ విత్తనాలు ముందుగానే పాలుపోసుకుని గింజ గట్టిపడే దశకు చేరుకున్నాయి. అసలు విత్తనం 1001 రకం ఇంకా దుబ్బు దశలోనే ఉంది. ఎకరం విస్తీర్ణంలో నకిలీ విత్తనాల పంట ఏడెనిమిది బస్తాల వరకూ ఉంది. ఈ పంట ముందుగానే చేతికి వస్తుంది. దీన్ని కోసే పరిస్థితి లేదు. ధాన్యం కొనుగోలుదారులు ఈ పంటను కొనరు. కొన్నా అతి తక్కువ ధర చెల్లిస్తారు. ఇప్పటికే ఎకరానికి రూ.15 వేలకు పైగా పెట్టుబడి అయ్యింది. పంట చేతికి వచ్చేసరికి మరో రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. ఏపీ సీడ్స్ నిర్వాకం వల్ల దిగుబడి రాక నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మెట్టలో మినుము
మెట్ట ప్రాంతాలకు వెళితే.. కొయ్యలగూడెం తదితర మండలాల్లో మినుములు మొలకెత్తని పరిస్థితి ఉంది. ప్రై వేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేసిన మినుములు రెండు నెలలు దాటినా మొలకెత్తలేదు. అనధికారికంగా విత్తనాలు విక్రయించే వ్యాపారి నుంచి కొనుగోలు చేసిన మినుములు మొలకెత్తకపోవడంతో రైతులు వెళ్లి నిలదీశారు. భారీ వర్షాల కారణంగా మొక్కలు మొలవలేదన్న సమాధానం వచ్చింది. దిప్పకాయలపాడు, గొల్లగూడెం, మంగతిపతిదేవీపేట గ్రామాల్లో విత్తనాలు మొలకెత్తలేదని రైతులు వాపోతున్నారు. మినుము మొలకెత్తకపోగా చేలల్లో కలుపు పెరిగిపోయింది. దీంతో ఆక్కడి రైతులు వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేశారు. కల్తీ వరి విత్తనాలు, నకిలీ మినుము విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కౌలు రైతుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement