-
డ్వాక్రా రుణ మంజూరు తీరు ఇలా...
-
2016–17 ఆర్థిక సంవత్సర లక్ష్యం రూ.1,346.24 కోట్లు
-
అర్ధ సంవత్సరంలో ఇచ్చింది రూ.250 కోట్లే...
-
ఇవ్వాల్సింది ఇంకా 1096 కోట్లు
2014–15లో రూ.1,240 కోట్లు లక్ష్యం
ఆ ఏడాదిలో ఇచ్చింది రూ.367 కోట్లు
సభ్యులకు చేరని సొమ్ము రూ.873 కోట్లు
2015–16లో రూ.1730 కోట్లు లక్ష్యం
సభ్యులకు చేరిందీ రూ.1296 కోట్లు ఇవ్వగలిగారు...
చేరని సొమ్ము...రూ.434 కోట్లు
కాకినాడ సిటీ :
జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం స్వయం సహాయక సంఘాల (డ్వాక్రా)కు మంజూరు చేసే రుణ లక్ష్య ప్రగతి అంతంతమాత్రంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా 89,994 డ్వాక్రా సంఘాలుండగా, వీటి పరిధిలో 8,77,586 మంది సభ్యులుగా ఉన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 59,587 సంఘాలకు రూ.1,346.24 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 13,353 సంఘాలకు రూ.250 కోట్ల మేర మాత్రమే రుణాలివ్వగలిగారు. రుణ మంజూరులో ఈ అర్ధ వార్షిక ప్రగతిని పరిశీలిస్తే..ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వడం కష్టసాధ్యమే అనిపిస్తోంది.
లక్ష్య సాధనలో విఫలం
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళా సంఘాలకు రుణాల కల్పనలో మొండిచేయి చూపించింది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 38,233 సంఘాలకు రూ.1,240.25 కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించి, కేవలం 11,326 సంఘాలకు రూ.367.25 కోట్ల మేరకు మాత్రమే రుణాలిచ్చింది. దీంతో లక్ష్యసాధనలో అధికారులు చతికిలపడ్డారు. అలాగే 2015–16లో 46,986 సంఘాలకు రూ.1,730.71 కోట్లు లక్ష్యం కాగా, 42,835 సంఘాలకు రూ.1,296.71 కోట్ల రుణాలు ఇవ్వగలిగారు. రుణాలు కల్పన లక్ష్యం మేరకు ప్రగతి సాధించలేని పరిస్థితి జిల్లాలో నెలకొంది. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం ఎన్నికలకు ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించడంతో, రుణ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లింపులు జరగలేదు. తీరా అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం చేతులెత్తేసింది.
మ్యాచింగ్ గ్రాంటూ లేదు
ఒక్క పైసా కట్టొద్దు, అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేశారు. తీరా అధికారంలోకి వచ్చాక మాఫీ కాదు, రూ.లక్ష మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామని ప్రకటించారు. ఆ మ్యాచింగ్ గ్రాంట్‌కూ దిక్కులేకుండా పోయింది. చివరికి సంఘంలోని ఒక్కో సభ్యురాలికి రూ.3 వేల చొప్పున మూల నిధిగా సంఘ ఖాతాలో జమచేసి చేతులు దులుపుకుంది. చంద్రబాబు మాయమాటలు నమ్మి æవాయిదాలు చెల్లించడం మానేసిన సంఘాలకు వడ్డీ లేని రుణం కాదు కదా, కనీసం పావలా వడ్డీ రాయితీ కూడా కోల్పోయారు. మరోపక్క బ్యాంకర్లు కొత్త రుణాల మంజూరు విషయంలో స్పందన అంతంత మాత్రంగానే ఉంటోంది.
వడ్డీ వ్యాపారులే దిక్కు!
గతంలో బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా రుణాలు మంజూరు చేసేవి. మైక్రో సంఘాలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారులు కాళ్లావేళ్లా పడినా రుణాలు తీసుకునేందుకు మహిళలు ఆసక్తి చూపేవారు కాదు. ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. బ్యాంకర్లు ముఖం చాటేస్తుండడంతో వ్యాపార, కుటుంబ అవసరాల కోసం డ్వాక్రా సంఘాలు మళ్లీ ప్రైవేటు వడ్డీ వ్యాపారులు, మైక్రోఫైనాన్స్ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఐదు, పది రూపాయల వడ్డీలు వసూలుచేస్తున్నా అవసరాల కోసం వారిని ఆశ్రయించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
లక్ష్యం మేరకు రుణాల మంజూరు
డ్వాక్రా సంఘాలకు నిర్దేశిత లక్ష్యం మేరకు రుణాలు మంజూరుకు ముమ్మర చర్యలు తీసుకుంటున్నాం. తీసుకున్న రుణంతో ఆర్థికంగా సంఘాలు నిలదొక్కుకునేలా వివిధ యూనిట్ల ఏర్పాటుకు ప్రోత్సహిస్తున్నాం.
– శ్రీనివాస కుమార్, ఏపీడీ, డీఆర్‌డీఏ