
ఆరు గ్యారంటీల్లో భాగంగా ప్రతినెలా రూ. 2,500 ఇస్తామని హామీ
మార్గదర్శకాలను సిద్ధం చేయని ప్రభుత్వం
త్వరగా అమలు చేయాలని కోరుతున్న అతివలు
నిజామాబాద్: అర్హులైన మహిళలకు ప్రతి నెలా రూ. 2,500ల చొప్పున ఆర్థిక సాయం అందించడానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని రేవంత్‌రెడ్డి సర్కారు ఇంకా పచ్చజెండా ఊపలేదు. ఫలితంగా ఈ పథకం కింద సాయం కోసం ఎంతో మంది మహిళలు నిరీక్షిస్తున్నారు. ప్రధానంగా ఆసరా పథకం కింద పింఛన్ అందుకోలేని మహిళలు తమకు మహాలక్ష్మి సాయం కొండంత అండగా ఉంటుందని ఆశతో ఎదురుచూస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా ఆర్థిక సాయం అందిచడం ఒకటి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆరు గ్యారంటీల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,196 కోట్లను కేటాయించింది. ఆసరా పథకం కింద జిల్లాలో 77,158 మంది వితంతువులు, 10,520 మంది ఒంటరి మహిళలు, 96,264 మంది బీడీ కారి్మకులు ప్రతినెలా పింఛన్లను అందుకుంటున్నారు.
వృద్ధాప్య, వికలాంగులు పింఛన్లలోనూ కొంత మంది అర్హులైన మహిళలు ఉన్నారు. జిల్లాలో 7,18,603 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వీరిలో ఆసరా పింఛన్లను అందుకోలేని మహిళలు మహాలక్ష్మి సాయం ద్వారా లబ్ధి పొందవచ్చని భావిస్తున్నారు. ఇప్పటి వరకు మార్గదర్శకాలను రూపొందించకపోవడంతో మహాలక్ష్మి సాయం ఎంత మందికి వస్తుంది, ఎవరు అర్హులనే విషయం తేలుతుంది. అసలు మహాలక్ష్మి పథకం అమలు చేస్తారా లేదా అనే అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో ఎలాంటి సర్వే జరపకపోవడం, అర్హుల ఎంపికకు చర్యలు తీసుకోకపోవడంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పార్లమెంట్ ఎన్నికల తంతు ఎలాగూ ముగిసిపోయింది. మరో వారం రోజుల్లో కోడ్ ఎత్తివేసే అవకాశం ఉంది. అప్పటికైనా మహాలక్ష్మి సాయంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని పలువురు కోరుతున్నారు.
ఇవి చదవండి: సీఎం రేవంత్‌రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్