వర్తక సంఘాల ప్రతినిధులతో మాట్లాడుతున్న డీడీ శ్రీనివాసరావు
-
వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరావు
ఖమ్మం వ్యవసాయం: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ–నామ్(ఎలక్ట్రానిక్ జాతీయ వ్యవసాయ మార్కెట్)ను ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేశామని, దానిని సమర్థంగా నిర్వహించాలని వరంగల్ రీజియన్ మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్ వి.శ్రీనివాసరావు చెప్పారు. సోమవారం మార్కెట్ కార్యాలయంలో వర్తక సంఘం ప్రతినిధులతో ఈ–నామ్‌పై నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ విధానం వల్ల పంట ఉత్పత్తులకు పోటీ ధర లభిస్తుందన్నారు. మన రాష్ట్రంలో 44 రెగ్యులేటెడ్ మార్కెట్‌లలో ఈ పద్ధతిని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. నాణ్యమైన సరకును ఏ ప్రాంతం నుంచైనా కొనుగోలు చేసుకునే వీలుంటుందన్నారు. చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రధాన కార్యదర్శి చిన్ని కృష్ణారావు, ఉపాధ్యక్షులు, రాష్ట్ర కాటన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గొడవర్తి శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఈ–నామ్ నిర్వహణకు ప్రస్తుత మార్కెట్ స్థాయి సరిపోదని, 100 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగి ఉండాలని అన్నారు. దిగుమతి శాఖ అధ్యక్ష, కార్యదర్శులు నున్నా కోదండరాములు, మాటేటి రామారావు మాట్లాడుతూ ఈ–నామ్ వ్యవస్థతో కమీషన్ వ్యాపారుల వ్యవస్థకు ఇబ్బంది కలుగుతుందని తెలిపారు.