మధ్యాహ్నభోజనాన్ని వడ్డిస్తున్న దశ్యం (ఫైల్‌ఫోటో)
– ఈ–పాస్ విధానం ప్రవేశపెట్టాలని విద్యాశాఖ కసరత్తు
– సమస్యలు తలెత్తితే విద్యార్థులు పస్తులే
చిత్తూరు (ఎడ్యుకేషన్):
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజనానికి సరఫరా చేసే బియ్యం పక్కదారి పట్టకుండా ప్రభుత్వం, రాష్ట్ర విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుతం రేషన్ షాపుల్లో అమలవుతున్న ఈ–పాస్ విధానాన్ని మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాలోను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ విధానం అమల్లోకి వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తున్నా రేషన్‌దుకాణాల్లో లబ్ధిదారులకు బియ్యం సక్రమంగా అందడంలేదనే విమర్శలున్నాయి. అయితే ఇవేవి పట్టించుకోకుండా పాఠశాలలకు సరఫరా చేసే బియ్యాన్ని ఈ–పాస్ విధానంతో అనుసంధానం చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలిచ్చింది.
ఈ– పాస్ విధానంలో భాగంగా మధ్యాహ్న భోజనం బియ్యం తీసుకునేందుకు పాఠశాల హెచ్‌ఎం పేరు, మొబైల్ నంబర్, ఆధార్ సంఖ్య, వంట నిర్వాహకుల ఆధార్ నంబర్లు ఆన్‌లైన్‌లో పొందపరచనున్నారు. ఇందులో భాగంగా వారు మాత్రమే బియ్యాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా ప్రతి రోజూ మధ్యాహ్నభోజనానికి సంబంధించిన వివరాలను పాఠశాల హెచ్‌ఎం తప్పనిసరిగా ఉన్నతాధికారులకు ఎస్‌ఎంఎస్ రూపంలో పంపాలని, అలాగే విద్యాశాఖ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేయాలి. ఈ విధానంతో మధ్యాహ్నభోజనం అమలులో పారదర్శకత పెరుగుతుందన్నది రాష్ట్ర విద్యాశాఖ ఉద్దేశం. ఈ విధానంలో నిర్లక్ష్యం వహిస్తే మధ్యాహ్నభోజన నిధులు, బియ్యం సరఫరా నిలిపివేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ విధానంపై వారం రోజుల క్రితం జరిగిన సర్వశిక్షా అభియాన్ ఎంఐఎస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల జిల్లా సమావేశంలో శిక్షణ ఇచ్చారు.
లోపాల సంగతేంటి?
ప్రస్తుతం రేషన్‌షాపుల్లో అమలవుతున్న ఈ–పాస్ విధానంతో కొన్ని నెలలు అంత్యోదయ, అన్నయోజన కార్డుదారులకు బియ్యం సక్రమంగా సరఫరా చేయలేదు. 35 కిలోలు తీసుకునే వారు 5 కిలోలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతవరకు ఈ సమస్యను పరిష్కరించినా ఇప్పటికీ సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. అందువల్ల ఈ–పాస్ విధానంలో సమస్యలొస్తే బియ్యం సరఫరా కాక విద్యార్థులు పస్తులుండాల్సి వస్తుందని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు.
మంచి పద్ధతే
మధ్యాహ్నభోజనం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల పారదర్శకత ఏర్పడుతుంది. ఉన్నతాధికారులకు కూడా దీనిపై సమాచారం పక్కాగా అందుతుంది. ఈ–పాస్ విధానంలో సాంకేతిక సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుంది
– సహదేవనాయుడు, ఎస్టీయూ