ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలు
– కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రభుత్వ విధానాలతో ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి అన్నారు. కృష్ణగిరి మండలం లాల్‌మాన్‌పల్లికి చెందిన టీడీపీ నాయకుడు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు చిన్నకాలేసాహెబ్ నాయకత్వంలో సుమారు 200 మంది ఆ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం స్థానిక జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో వారికి కోట్ల సూర్య పార్టీ కండువాలు కప్పారు. తర్వాత డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు జరిగినప్పటి నుంచి ప్రజలు బ్యాంకుల్లో డబ్బు వేయడానికి భయపడుతున్నారన్నారు. బ్యాంకుల్లో లావాదేవీలు కూడా 50 శాతం మేర తగ్గిపోయాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా నెరవేర్చలేదన్నారు. దేశాన్ని పాలించే సత్తా ఒక్క కాంగ్రెస్‌కే ఉందని, తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. డీసీసీ అధ్యక్షుడు పి.లక్ష్మిరెడ్డి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంపై రైతులు, ప్రజలు, చివరికి ఆ పార్టీ కార్యకర్తలు కూడా విసిగిపోయారన్నారు. చంద్రబాబుకు అమరావతి తప్ప రాయలసీమ గోడు పట్టడం లేదని విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సర్దార్ బుచ్చిబాబు, ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు పూడూరు నాగమధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.