మాపై చిన్నచూపేల?
మాపై చిన్నచూపేల?
Published Thu, Jan 19 2017 10:53 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
విద్యాశాఖ ఉద్యోగుల ఆవేదన
రెగ్యులర్ చేస్తామన్న ఎన్నికల హామీ గాలికే
కనీసం జీతాలు కూడా పెంచకుండా చిన్నచూపు
కాంట్రాక్ట్ సిబ్బంది అరకొర జీతాలతో ఆర్థిక ఇబ్బందులు
కొత్తపేట :‘‘అన్ని ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు చెల్లిస్తాం’’ ఇది టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు గత ఎన్నికల్లో చేసిన హామీ. రెగ్యులర్ చేయడం అటుంచితే ఆయన అధికారం చేపట్టాక కనీసం ఒక్క రూపాయి కూడా జీతం పెంచలేదని విద్యాశాఖ ఉద్యోగులు వాపోతున్నారు. విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ద్వారా వివిధ విభాగాల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 1,200 మంది పనిచేస్తున్నారు. వారిలో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్స్ (డ్రాయింగ్, క్రాఫ్ట్, పీఈటీ)గా ప్రతి మండలం నుంచీ 10 నుంచి 12 మంది చొప్పున 692 మంది, క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌స (సీఆర్‌పీ)లుగా ప్రతి మండలంలో నలుగురి నుంచి ఆరుగురు చొప్పున సుమారు 300 మందితో పాటు కంప్యూటర్ ఆపరేటర్స్, మండల ఇన్‌ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్స్, మండల రిసోర్స్ సెంటర్ (ఎంఆర్‌సీ) అసిస్టెంట్స్‌గా 64 మంది చొప్పున పనిచేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్లు సుమారు పదేళ్లు క్రితం రూ.1,500 నుంచి ప్రారంభమై ప్రస్తుతం రూ.10 వేలకు పని చేస్తున్నారు. ఎంఆర్‌సీ అసిస్టెంట్స్ కూడా పదేళ్ల నుంచి రూ వెయ్యితో ప్రారంభమై ప్రస్తుతం రూ 7,500కు పనిచేస్తున్నారు. సీఆర్పీలు 2011 నుంచి, పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్స్ 2012లో రూ 4,500 జీతంతో చేరి ప్రస్తుతం రూ 8,500కు, ఎంఐఎస్ కోఆర్డినేటర్స్ రూ.6,500కు జీతానికి చేరి ప్రస్తుతం రూ.12 వేలకు పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాం నుంచి 2013 వరకూ ఏటా అలాగే టీచర్స్ పీఆర్సీ ప్రకటించినప్పుడల్లా రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకూ జీతం పెరుగుతూ వచ్చింది. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఈ రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి పెంచిన దాఖలాలు లేవని ఆ ఉద్యోగులు వాపోయారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులకు మాత్రం ఆ ఉత్తర్వులు వర్తింపజేయలేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణా ప్రభుత్వం తాజాగా గత ఏడాది సెప్టెంబర్‌లో జీతాలు పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఏపీ ప్రభుత్వం ఆదిశగా ఆలోచనే చేయడం లేదని పలువురు ఉద్యోగులు వాపోయారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్న తమకు జీతాలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Advertisement
Advertisement