విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి
♦ ఆ మేర పంపిణీ సంస్థలను ఆదేశించండి
♦ హైకోర్టులో ప్రొఫెసర్ హరగోపాల్ పిల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల్లో పనిచేస్తున్న 2,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసులను పంపిణీ సంస్థలు క్రమబద్ధీకరించేలా ఆదేశించాలంటూ పౌర హక్కుల నేత, ప్రొఫెసర్ హరగోపాల్ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. వారికి ఇతర ఉద్యోగుల్లాగానే చట్ట ప్రకారం సమాన జీతాలు చెల్లించేలా ఆదేశించాలని కోరారు. విద్యుత్‌శాఖ ముఖ్య కార్యదర్శి, జెన్‌కో, ట్రాన్స్‌కో డెరైక్టర్లు, కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి, విద్యుత్ పంపిణీ సంస్థల ఎండీలను వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.
కొత్తగూడెం, భూపాలపల్లి, శ్రీరామ్‌సాగర్, రామగుండం, నాగార్జునసాగర్, జూరాల ప్రాజెక్టుల పరిధిలోని సబ్‌స్టేషన్లు, ఇతర విద్యుత్ పంపిణీ కేంద్రాల్లో మూడు దశాబ్దాలుగా 2,500 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్నారని, వీరి సర్వీసులను ఇప్పటివరకు క్రమబద్ధీకరించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని హరగోపాల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కార్మికులు సమ్మెకు దిగినప్పుడు వివాద పరిష్కారానికి తాను మధ్యవర్తిగా వ్యవహరించానని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు స్పష్టమైన హామీనిచ్చినా నేటికీ నిలబెట్టుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న షిఫ్ట్ ఇన్‌చార్జి, ఆపరేటర్ల జీతాలకు, శాశ్వత ప్రాతిపదికన పనిచేస్తున్న షిఫ్ట్ ఇన్‌చార్జి, ఆపరేటర్ల జీతాలకు ఎంతో వ్యత్యాసం ఉందని, ఇది ఒకే పనికి ఒకే జీతం చెల్లించాలన్న చట్ట నిబంధనలకు విరుద్ధమన్నారు. ఈ విషయాన్ని వినతిపత్రాల ద్వారా ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా ప్రయోజనం లేకపోయిందన్నారు.