మా సభకు అనుమతినిచ్చేలా ఆదేశాలివ్వండి
- హైకోర్టులో టీడీఎఫ్ పిటిషన్
- మావోయిస్టుల కోణంలో సభ జరుగుతోంది
- అందుకే సభకు అనుమతిని ఉపసంహరించాం
- కోర్టుకు నివేదించిన ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది
- తదుపరి విచారణ నేటికి వాయిదా
సాక్షి, హైదరాబాద్: పౌర హక్కుల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ నిరసన తెలిపేందుకు ఈ నెల 24న తాము నిర్వహించ తలపెట్టిన ర్యాలీ, బహిరంగ సభలకు వరంగల్ జిల్లా, మట్టవాడ పోలీసులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ డెమోక్రటిక్ ఫోరం (టీడీఎఫ్) కన్వీనర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాన్ని సోమవారం న్యాయమూర్తి జస్టిస్ బి.శివశంకరరావు విచారించారు. పిటిషనర్ తరఫున వి.రఘునాథ్ వాదనలు వినిపిస్తూ, ఈ నెల 24న వరంగల్‌లోని ఇస్లామియా ఎడ్యుకేషనల్ సొసైటీ గ్రౌండ్స్‌లో బహిరంగ సభ, ర్యాలీకి మొదట పోలీసులు అనుమతినిచ్చారన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 20, 21వ తేదీల్లో సొసైటీ కార్యదర్శి పిటిషనర్‌కు ఫోన్ చేసి అనుమతిని ఉపసంహరించుకోవాల్సిందిగా మట్టవాడ పోలీసులు ఒత్తిడి చేస్తున్న విషయాన్ని చెప్పారన్నారు. తర్వాత వరంగల్ నగర ఏసీపీ, మట్టవాడ పోలీసులు పిటిషనర్‌ను పిలిచి ర్యాలీకి, మైక్ వినియోగానికి అనుమతిని నిరాకరిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారని వివరించారు.
ప్రభుత్వాన్ని విమర్శించేందుకే సభ
ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ వాదనలు వినిపిస్తూ, ప్రభుత్వాన్ని విమర్శించేందుకే టీడీఎఫ్ ఈ సభను నిర్వహిస్తోందన్నారు. మావోయిస్టుల కోణంలో ఈ సభను నిర్వహిస్తున్నారని వివరించారు. ఈ సమయంలో రఘునాథ్ స్పందిస్తూ, హంటర్‌రోడ్‌లోని విష్ణుప్రియ గార్డెన్స్‌ను సభ నిర్వహణకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, సభ నిర్వహణకు అనుమతినిచ్చే విషయాన్ని పరిశీలించాలని శరత్‌కు సూచించారు. అనుమతిపై తాను ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకోలేనని, కొంత గడువు కావాలని శరత్ కోరారు. ఇందుకు న్యాయమూర్తి అంగీకరిస్తూ విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.