ఆడిటింగ్‌కు డిస్కంలు సహకరించటం లేదు
న్యూఢిల్లీ: నగరంలో విద్యుత్ పంపిణీ చేస్తున్న ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థలు ఆడిటింగ్ తమతో సహకరించడంలేదని ఢిల్లీ హైకోర్టుకు బుధవారం కాగ్ నివేదించింది. అనిల్ అంబానీ, టాటా గ్రూపులకు చెందిన ప్రైవేట్ పంపిణీ కంపెనీలు ఏర్పాటు దగ్గరనుంచి వాటి ఆర్థిక వ్యవహారాల ఆడిటింగ్‌కు గత ఆప్ సర్కార్ ఆదేశించిన విషయం తెలిసిందే.
అయితే ఈ నిర్ణయంపై స్టే విధించాలని జనవరి 24న ఆయా కంపెనీలు హైకోర్టును ఆశ్రయించగా తిరస్కరించింది. ఇదిలా ఉండగా, బుధవారం కోర్టుకు కాగ్ తన నివేదికను అందజేసింది. ఆయా కంపెనీలు ఆడిటింగ్‌కు సహకరించడంలేదని అందులో కాగ్ ఆరోపించింది.
కాగా, ఆయా కంపెనీల సహాయ నిరాకరణ విషయమై కాగ్ మూడు వారాల్లో దరఖాస్తుచేయాలని ఆదేశించి, కేసు తదుపరి విచారణను మే 16కు వాయిదావేసింది. దేశ రాజధానిలో మూడు ప్రైవేట్ కంపెనీలు విద్యుత్‌ను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. షీలాదీక్షిత్ సర్కార్ సమయంలో విద్యుత్ టారిఫ్‌లు నగరంలో చాలా ఎక్కువగా ఉన్నాయని ఆరోపిస్తూ ఆప్ ఉద్యమాలు నిర్వహించింది.
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆమ్‌ఆద్మీపార్టీ తాము అధికారంలోకి వస్తే కరెంటు పంపిణీ కంపెనీల వ్యవహారంపై కాగ్‌తో ఆడిటింగ్ జరిపిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. ఆప్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2013 డిసెంబర్ 27న ఆయా ప్రైవేట్ విద్యుత్ పంపిణీ కంపెనీల ఆర్థిక వ్యవహారాలపై ఆడిటింగ్‌కు కాగ్‌ను ఆదేశించింది. డిస్కంల ఆర్థిక వ్యవహారాలు, ఎకౌంట్లు సరిగా ఉంటే కాగ్ ఆడిటింగ్‌కు భయపడాల్సిన అవసరం ఏముందని ఆప్ సర్కార్ ప్రశ్నించింది.
డిప్యూటీ సెక్రటరీ (విద్యుత్) అల్కా శర్మ దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ మేరకు నిలదీశారు.‘ప్రజాస్వామ్యంలో ఆడిట్ అనేది చాలా ముఖ్యమైన ఆయుధం.. డిస్కంలు దీనికి ఎందుకు భయపడుతున్నాయో.. ఎందుకు స్టే విధించాలని కోరుతున్నాయో అర్థం కావడంలేదు..’ అని అఢిడవిట్‌లో పేర్కొన్నారు. ఆయా డిస్కంలలో 49 శాతం వాటా ప్రభుత్వానికి ఉన్నందున ప్రజల్లో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ప్రభుత్వం ఆడిటింగ్‌కు ఆదేశించిందన్నారు.
ప్రైవేట్ కంపెనీలు దాఖలుచేసిన స్టే పిటిషన్‌ను తిరస్కరించి కాగ్ ఆడిటింగ్‌కు అంగీకరించేలా వాటిని ఆజ్ఞాపించాలని కోర్టును కోరారు. కొంతసేపు వాదనలు విన్న తర్వాత జస్టిస్ మన్మోహన్ మాట్లాడుతూ ఈ మొత్తం విషయాన్ని డివిజన్ బెంచ్‌కు నివేదిస్తానని చెప్పారు. దీనికి డిస్కంలు ఆమోదించగా ఢిల్లీ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఇదిలా ఉండగా గత జనవరి 24వ తేదీన జస్టిస్ మన్మోహన్ ఇచ్చిన తీర్పుపై డిస్కంలు వేసిన పిటిషన్ ఈ నెల 24న విచారణకు రానుంది.
జనవరి 24వ తేదీన జరిగిన వాదనల్లో జస్టిస్ మన్మోహన్ డిస్కంల స్టే దరఖాస్తును తిరస్కరించడమే కాకుండా కాగ్ ఆడిటింగ్ పూర్తిగా సహకరించాలని ఆయా కంపెనీలను ఆదేశించారు. రాజధాని నగరంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసిన నేపథ్యంలో 2002 నుంచి ఈ ప్రైవేట్ కంపెనీలు ఢిల్లీలో విద్యుత్ పంపిణీ చేస్తున్నాయి.
కాగా, కాగ్ ఆడిటింగ్‌కు డిస్కంలు సహకరించడంలేదని కాగ్ న్యాయవాది వాదించడంపై బుధవారం బీఎస్‌ఈఎస్ విద్యుత్ సంస్థ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. ఆడిటింగ్ సక్రమంగా జరుగుతోందని, వారి అడిగే సమాచారాన్నంతా తాము ఆడిటింగ్ అధికారులకు అందజేస్తున్నామని వారి తరఫు న్యాయవాది కోర్టులో విన్నవించారు.