
వామ్మో... గోడౌన్లే దోచేస్తున్నారు!
ఎలక్ట్రానిక్స్ గోడౌన్స్ టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని ముగ్గురు మహిళలను సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి భారీగా ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
♦ మహిళా దొంగల ముఠా ఆటకట్టు
♦ ముగ్గురి అరెస్టు పరారీలో ఏడుగురు
♦ రూ. 5.28 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
చైతన్యపురి: ఎలక్ట్రానిక్స్ గోడౌన్స్ టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాలోని ముగ్గురు మహిళలను సరూర్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి భారీగా ఎలక్ట్రానిక్స్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ముగ్గురూ పాతనేరస్తులు కావడం గమనార్హం. ఎల్బీనగర్ ఏసీపీ పి.వేణుగోపాలరావు బుధవారం సరూర్‌నగర్ ఠాణాలో సీఐలు లింగయ్య, సురేందర్‌లతో కలిసి తెలిపిన వివరా ల ప్రకారం... సైదాబాద్ సింగరేణి కాలనీ లో నివాసం ఉంటూ కూలీ పని, పాతపేపర్లు ఏరుకొని జీవిస్తున్న తొమ్మిది మంది మహిళలు మోతీలాల్ అనే వ్యక్తి నాయకత్వంలో ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నారు. ఫిబ్రవరి 15న కర్మన్‌ఘాట్‌లోని వీబీ ఎలక్ట్రానిక్స్ ఎంటర్‌ప్రైజెస్‌కు చెంది న గోదామును టార్గెట్ చేసిందీ ముఠా.
వాచ్‌మన్‌ను కొందరు మహిళలు మాట ల్లో పెట్టగా... మరి కొందరు షట్టర్ తీసి అందులోని విలువైన ఎలక్ట్రానిక్స్ గృహోపకరణాలను డీసీఎంలో తరలించుకుపోయారు. అలాగే, పక్కనే ఉన్న కవిత రైస్ మిల్ షట్టర్‌ను తెరిచి 20 బస్తాల బియ్యం చోరీ చేసుకుపోయారు. రైస్ మిల్, ఎల క్ట్రానిక్స్ గోడౌన్ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సింగరేణి కాలనీలో దాడులు చేసి బనావత్ బుజ్జి(30), రమావత్ కేళి (30), రమావత్ ముయి (25)లను అదుపులోకి తీసుకున్నారు. వారి ఇళ్లల్లో మం చాల క్రింద దాచి పెట్టిన 10 ఎల్‌సీడీ టీవీలు, మూడు రైస్‌కుక్కర్‌లు, 3 మిక్సర్ గ్రైండర్‌లు, ఒక గ్యాస్ స్టౌ, ఒక హోమ్ థియేటర్, నాలుగు బియ్యం బస్తాలు స్వాధీనం చేసుకున్నారు.
వీటివిలువ సుమారు రూ. 5.28 లక్షలు. అనంతరం ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మొత్తం పది మందికి సంబంధం ఉండగా.. ప్రధాన నిందితుడు మోతీలాల్‌తో పాటు భూరి, కమలి, అనిత, సంతోళి, జ్యోతి, లక్ష్మి పరారీలో ఉన్నారని ఏసీపీ చెప్పారు. వీరిపై సుమారు 40 కేసులు ఉన్నాయన్నారు. గతంలో ఎల్బీనగర్, రామచంద్రాపురం, నాచారం స్టేషన్ల పరిధిలో ఇళ్లల్లో చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లొచ్చారని తెలిపారు. వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు. సమావేశంలో క్రైం ఎస్‌ఐ శ్రీనివాస్ తదితరుల పాల్గొన్నారు.