ప్రశాంతంగా ఎంసెట్–3
ప్రశాంతంగా ఎంసెట్–3
Published Sun, Sep 11 2016 10:45 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM
ఆదిలాబాద్ టౌన్ : ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం ఆదివారం నిర్వహించిన ఎంసెట్– 3 ప్రశాంతంగా జరిగింది. ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు పరీక్ష కొనసాగింది. జిల్లా కేంద్రంలో మూడు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. నిమిషం ఆలస్యం నిబంధన ఉండడంతో అభ్యర్థులు గంట ముందుగానే కేంద్రాలకు చేరుకున్నారు. బయోమెట్రిక్ విధానం అమలు చేశారు. ఎంసెట్–2 పేపర్ లీక్ కావడంతో పరీక్షను పకడ్బందీగా నిర్వహించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేశారు. పోలీసులు అభ్యర్థులను క్షుణంగా పరిశీలించిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
మొత్తం 932 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 563 మంది హాజరయ్యారు. 369 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో 460 మందికి 281 మంది పరీక్ష రాయగా, 179 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 232 మందికి 139 మంది హాజరయ్యారు. 93 మంది గైర్హాజరయ్యారు. ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల కేంద్రంలో 240 మందికి 143 మంది పరీక్షకు హాజరయ్యారు. 97 మంది గైర్హాజరయ్యారు.
పరీక్ష కేంద్రాలను రాష్ట్ర పరిశీలకులు శ్రీధర్‌రెడ్డి, వసంత్‌కుమార్, ఎంసెట్ పరీక్ష రీజినల్ కోఆర్డినేటర్లు పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పరీక్ష ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
Advertisement