అత్యవసర వైద్యం.. అందని దైన్యం | emergancy medicine scare in government hospital | Sakshi
Sakshi News home page

అత్యవసర వైద్యం.. అందని దైన్యం

Published Fri, Jul 29 2016 10:31 PM | Last Updated on Mon, Sep 4 2017 6:57 AM

అత్యవసర వైద్యం.. అందని దైన్యం

అత్యవసర వైద్యం.. అందని దైన్యం

► అలంకారంగా సర్వజనాస్పత్రి ఏఎంసీ వార్డు
►పరీక్షలే కాదు.. సేవలూ అంతంతే
తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలు


ఎవరికి ప్రాణం మీదికి వచ్చినా జిల్లాలో వెంటనే గుర్తొచ్చేది అనంతపురంలోని సర్వజనాస్పత్రి. ఇక నిరుపేదలకైతే ఇదే ఏకైక దిక్కు. అందువల్లే ఇక్కడికొచ్చే రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ మేరకు వైద్యసేవలందించాల్సిన సర్వజనాస్పత్రిలో మాత్రం సౌకర్యాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. పరికరాలు, సిబ్బంది సంఖ్య, వైద్యులు సేవలు కూడా అంతంత మాత్రమే కావడంతో ఇక్కడికి వస్తున్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

అనంతపురం సిటీ: సర్వజనాస్పత్రిలోనిlఆక్యూప్‌ మెడికల్‌ కేర్‌ (ఏఎంసీ) వార్డులో ఎక్కువగా అత్యవసర కేసులకు సంబంధించిన రోగులకు చేర్చుకుంటారు. ప్రధానంగా విషం, పక్షవాతం, గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులకు చికిత్సలందిస్తారు.  వార్డులో 30 దాకా పడకలున్నాయి.  కానీ రోజూ ఇక్కడికి వచ్చే రోగుల సంఖ్య అంతకంటే ఎక్కువగా ఉంటోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఐసీసీయూ వార్డులో 12 పడకలుండగా, అక్కడా అదే పరిస్థితి.

పరికరాలే లేవు
గుండెపోటు, పక్షవాతం వచ్చిన రోగులకు వ్యాధి నిర్ధారణ చేసేందుకు మానిటర్స్, వెంటిలేటర్స్‌ ఏఎంసీ వార్డులో లేవు. దీంతో రోగి ఎలాంటి సమస్యతో బాధపడుతున్నాడో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. ప్రధానంగా ఎంఆర్‌ఐ, గుండె జబ్బుకు సంబంధించిన రక్తపరీక్షలకు అవసరమైన పరికరాలు లేవు. ఇక మెడికల్‌ కళాశాల ఏర్పడి 16 ఏళ్లు గడిచినా కిడ్నీ డయాలసిస్‌కు సంబంధించిన వైద్యులు ఇక్కడ లేరు. బీ బ్రాండ్‌ డయాలసిస్‌ యూనిట్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌ కింద ఏర్పాటు చేసినప్పటికీ.. కేవలం రెండు ఆర్డర్‌ కలిగిన వైద్యులతోనే సేవలు అందిస్తున్నారు. కిడ్నీ వ్యాధి నిపుణులైన డాక్టర్‌ సంజయ్‌ను కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన నియమించినా, ఆయన నెలలో రెండు రోజుల్లో, అదీ 20 మంది రోగులకు మించి  సేవలందించడం లేదని తెలుస్తోంది. మరోవైపు ఆయనకు ముందే నిర్దేశించిన రోజుల్లో రావడం లేదన్న ఆరోపణలున్నాయి.

ప్లెట్‌లెట్లు అందించాలన్నా కష్టమే
ప్రస్తుతం సీజనల్‌ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఈ క్రమంలోనే డయేరియాతో సర్వజనాస్పత్రికి వస్తున్న రోగుల సంఖ్య బాగా పెరిగింది. అయితే ఆస్పత్రిలో పడకల కొరత తీవ్రంగా ఉంది. ప్లేట్‌లెట్లు అందించాలన్నా...బ్లడ్‌ కాంపోసెట్‌ యూనిట్‌ కూడా పూర్తిగా పని చేయడం లేదు. ప్రస్తుతానికి ఈ విభాగంలో ఒక ప్రొఫెసర్, నలుగురు అసోసియేట్‌ ప్రొఫెసర్లు, నలుగురు అసిస్టెంట్‌ డాక్టర్లతో సేవలందిస్తున్నారు.  వీరంతా ఉదయం 9 గంటల నుంచి 1 గంట వరకు ఓపీ విభాగాల్లో, మధ్యాహ్నం నుంచి వార్డుల్లో చేరిన రోగులకు పరీక్షలు నిర్వహించాల్సి వస్తోంది.  దీంతో పని భారం పెరగడంతో మెరుగైన వైద్యం అందించలేకపోతున్నారు.

ఉన్నవాటితోనే మెరుగైన వైద్యం అందిస్తున్నాం  : –డాక్టర్‌ వెంకటేశ్వరరావు, మెడిసిన్‌ డిపార్ట్‌మెంట్‌ హెచ్‌ఓడీ
మా పరిధిలో ప్రతి రోగిని దగ్గరుండి చూసుకుంటున్నాం. ప్రైవేట్‌ ఆస్పత్రులకంటే దీటుగా చికిత్సలు అందిస్తున్నాం.   ఇక్కడి వైద్యులు చాలా అనుభవం గలవారు. పరికరాల కొరత వాస్తవమే. ఆయినా ఆ విషయం..ఆస్పత్రి యాజమాన్యం చూసుకుంటుంది. ఉన్న పరికరాలతో మేం సేవలందిస్తున్నాం. రోగులు ఇబ్బంది పడకూడదన్నదే మా లక్ష్యం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement