
నాల్గోతరగతి ఉద్యోగాలు భర్తీ చేయం
♦ ఆర్థికమంత్రి యనమల వెల్లడి
♦ మొత్తం ఖాళీలు 77 వేలేనన్న మంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న నాల్గోతరగతి ఉద్యోగాలను భర్తీ చేయబోమని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. మిగతా వాటిలో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయబోమన్నారు. ‘లక్ష ఉద్యోగాలు హుష్ కాకి’ శీర్షికతో సోమవారం సాక్షిలో ప్రచురితమైన కథనంపై మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం స్పందించారు. నాల్గోతరగతి పోస్టులు తీసేస్తే డెరైక్టు రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీచేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీలు 20 వేలు మాత్రమేనని మంత్రి చెప్పారు. అవసరాన్నిబట్టి మాత్రమే ఆ ఉద్యోగాలను భర్తీచేస్తామని తెలిపారు.
ప్రభుత్వ రంగంలోనే ఉపాధి కల్పించడం సాధ్యం కాదని, ప్రైవేట్ రంగంలో కూడా అనేక ఉపాధి అవకాశాలు పెంపొందిస్తామన్నారు. అందుబాటులోని సాంకేతిక పరిజ్ఞానంతో ప్రభుత్వ పాత్ర కూడా మారుతుందని చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయా శాఖలను పునర్వ్యవస్థీకరిస్తామన్నారు. కమలనాథ్‌న్ కమిటీ పరిధిలో స్టేట్‌క్యాడర్, మల్టీజోనల్ క్యాడర్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయని, ఈ పోస్టులు 76,429 ఉండగా ఇందులో 22,226 ఖాళీగా ఉన్నట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ ఉద్యోగుల వివరాలే కాకుండా రెగ్యులర్ ఉద్యోగులు కాని అంగన్‌వాడీ, మినీ అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లు, హోమ్‌గార్డులు, ఎయిడెడ్ సంస్థల ఉద్యోగులు, లాస్ట్‌గ్రేడ్ ఉద్యోగాల్లో ఉన్న అవుట్‌సోర్సింగ్ సిబ్బంది, స్థానిక సంస్థల ఉద్యోగుల వివరాలను కూడా కమలనాథన్ కమిటీకి అందించినట్లు తెలిపారు.
ఆ కమిటీకి అందించిన సమాచారం ప్రకారం 2016 జనవరి 1 నాటికి రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరైనవి 4,83,491 కాగా అందులో 4,05,754 మంది పనిచేస్తున్నారని, 77,737 ఖాళీలు ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. నాల్గోతరగతి ఉద్యోగాలను అవసరమైన మేరకు స్వల్పకాలిక పద్ధతిపై అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీచేస్తుంటారని వివరించారు. ఈ నేపథ్యంలో డెరైక్టు రిక్రూట్‌మెంటు ద్వారా భర్తీచేయడానికి అందుబాటులో ఉన్న ఖాళీలు 20 వేలు మాత్రమేనని మంత్రి స్పష్టంచేశారు.