జానపద కళలను ప్రోత్సహిద్దాం
కర్నూలు (కల్చరల్): పల్లె సీమల సంస్కృతికి ప్రతీకగా నిలిచే జానపద కళలను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు తెలిపారు. స్థానిక కృష్ణానగర్‌లోని శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన 16వ రాష్ట్ర స్థాయి జానపద నృత్య పోటీలను ఆయన ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ గత 16 ఏళ్లుగా ఎస్వీ ఫౌండేషన్ సాంస్కృతిక పోటీలు నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. సీమ కళాకారులు రాష్ట్రస్థాయిలో, జాతీయ స్థాయిలో బాగా రాణిస్తున్నారన్నారు. ఎస్వీ ఫౌండేషన్ విద్యార్థులలో చక్కని కళాభిరుచులను పెంపొందించే దిశగా కషి చేస్తోందన్నారు.
కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎస్వీ ఫౌండేషన్ నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో విజేతలైన కళాకారులు చాలా మంది రాష్ట్రస్థాయిలో ఉత్తమ కలాకారులుగా పేరు, ప్రఖ్యాతులు సంపాదించడం హర్షణీయమన్నారు. కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్ గోగినేని విజయకుమార్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా జానపద కళలకు నిలయమని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుండి పిల్లల్లో చక్కని కళాసక్తులు కల్గిస్తూ ఎస్వీ ఫౌండేషన్ వారిలో ఉత్తమ మానవీయ విలువలు పెంపొందిస్తుందన్నారు. శ్రీలక్ష్మి ఫంక్షన్‌హాలులో చిన్నారులు ప్రదర్శించిన జానపద నృత్యాల ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో మెప్మా పీడీ రామాంజనేయులు, ఎస్వీ సుబ్బారెడ్డి ఫౌండేషన్ కార్యధక్షులు రాయపాటి శ్రీనివాస్, వివిధ జిల్లాల నుండి వచ్చిన కాళాకారులు పాల్గొన్నారు.