అంతా వారిష్టమే!
-
ఇష్టారాజ్యంగా విద్యుత్ టవర్‌ల నిర్మాణం
-
నష్టపోతున్న రైతులు
-
పనుల అడ్డగింత
బాల్కొండ:
చత్తీస్‌ఘడ్ నుంచి రాష్ట్రానికి విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్మిస్తున్న భారీ విద్యుత్ టవర్‌ల నిర్మాణం వివాదాస్పదమవుతోంది. తమకు కనీస సమాచారం ఇవ్వకుండా పంటపొలాల్లో టవర్ నిర్మాణ పనులు చేపడుతూ పంటను నాశనం చేస్తున్నారని, తాము కోల్పోతున్న భూములకు పరిహారం ఎంతిస్తారో స్పష్టం చేయకుండా పనులు చేయడమేమిటని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని బుస్సాపూర్, సోన్‌పేట్, ముప్కాల్, కొత్తపల్లి, వేంపల్లి, వన్నెల్(బీ) గ్రామాల రైతులు టవర్‌ల నిర్మాణంలో విలువైన భూములు కోల్పోతున్నారు. ఈ గ్రామాల పరిధిలో సుమారు 50 భారీ టవర్‌లు నిర్మిస్తున్నారు. రైతులతో ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోకుండానే పంటపొలాల్లోకి వాహనాల ద్వారా సామగ్రి తీసుకువచ్చి పనులు చేపట్టడం పట్ల ఇదెక్కడి దౌర్జన్యమని రైతులు అంటున్నారు.
ఒక్కొక్కరికి ఒక్కో రకం పరిహారం..
కొందరు రైతులకు ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పరిహారం ఇస్తుండడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. ఓ రైతుకు రూ.48 వేలు, మరో రైతుకు రూ.80 వేలు, మరో రైతుకు రూ.2 లక్షల పరిహారం చెల్లించారని రైతులు తెలిపారు. ఒక్కొక్కరికి ఒక్కోరకంగా పరిహారం చెల్లించి తమ మధ్య చిచ్చు పెడుతున్నారని వాపోతున్నారు. తమ మధ్య ఐక్యత లేకుండాపోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంట నష్టం..
గత ఏడాది ఫిబ్రవరి నుంచి విద్యుత్ టవర్‌ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఫిబ్రవరిలో చేతికొచ్చిన పసుపు పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. ప్రస్తుతం చేతికొచ్చిన సోయా, పసుపు పంటను రైతులు నష్టపోతున్నారు. విద్యుత్ తీగలను ట్రాక్టర్ల సహాయంతో లాగుతున్నారు. ఒక్కో తీగ లాగేందుకు మూడు ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. దీంతో పంటలు నాశనమవుతున్నాయి. తమకు సమాచారం ఇవ్వకుండా ట్రాక్టర్‌లను పంటపొలాల్లోకి తీసుకొస్తున్నారని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి పంటకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
రూ.80 వేలు చెల్లించారు
మా భూమిలో టవర్ నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.80 వేలు ఇచ్చారు. మిగతా డబ్బులు ఎన్నిస్తారో, ఎప్పుడిస్తారో చెప్పలేదు. అంతా అయోమయంగా ఉంది. తమకు చెల్లించే నష్టపరిహారం ప్రకటించాలి.
లింగారెడ్డి, రైతు, ముప్కాల్
ఎన్ని ఇస్తారో చెప్పలేదు
మా భూమిలో విద్యుత్ టవర్ నిర్మిస్తున్నామని కనీస సమాచారం ఇవ్వలేదు. నా భూమి కోల్పోయాను. పరిహారం ఎంత చెల్లిస్తారో ఇప్పటి వరకు చెప్పలేదు. ఆందోళనగా ఉంది. పరిహారం ఎంతిస్తారో చెప్పాలి.
– తిరుపతి, రైతు, బుస్సాపూర్
పంట నష్టపోతున్నాం
మా పక్క చేనులో విద్యుత్ టవర్ నిర్మిస్తున్నారు. ట్రాక్టర్‌ల సహాయంతో విద్యుత్ తీగలు లాగుతున్నారు. దీంతో మా భూమిలో పసుపు, మక్క, సోయా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. పట్టించుకునే వారు లేరు.
– చిన్నారెడ్డి, రైతు, బుస్సాపూర్