స్కూల్ క్యాలెండర్ ప్రకారమే పరీక్షలు నిర్వహించాలి
Published Mon, Aug 29 2016 9:48 PM | Last Updated on Mon, Sep 4 2017 11:26 AM
ఏలూరు సిటీ : ఉపాధ్యాయులను బోధనేతర పనులకు, ఆన్‌లైన్ నమోదు కార్యక్రమాలకు వినియోగించకూడదని, స్కూల్ క్యాలెండర్ మేరకే పరీక్షలు, పాఠశాల సమయాలు ఉండాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేశాయి. స్థానిక గాంధీ జాతీయ మహావిద్యాలయంలో ఉపాధ్యాయ సంఘాల సమన్వయ సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి యూటీఎఫ్, ఏపీటీఎఫ్ 1938, ఏపీయూఎస్, ఆప్టా, వైఎస్సార్ టీఎఫ్, ఎంబీటీఎస్, పీఈటీ సంఘాల నాయకులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి షేక్ సాబ్జీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పాఠశాల విద్య శాఖ స్కూల్ క్యాలెండర్ జారీ చేసిందని, ఈ క్యాలెండర్‌కు భిన్నంగా బేస్‌మెంట్ పరీక్షలు నిర్వహించటం, పరీక్షల మార్కులు ఆన్‌లైన్ చేయటం, బడిగంటలు వంటి అదనపు కార్యక్రమాలతో బోధనా సమయం వృథా అవుతుందని తెలిపారు. బోధనా సమయం తగ్గిపోయి పరీక్షించే గంటలు పెరిగిపోవటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీటీఎఫ్ 1938 జిల్లా ప్రధాన కార్యదర్శి గుగ్గులోతు కృష్ణ మాట్లాడుతూ సెప్టెంబర్ 1న నిర్వహించే ధర్నాలో పాల్గొనే ఉపాధ్యాయుల వివరాలు అందించాలని, ఏ సంఘం నుంచి ఎంతమంది పాల్గొంటున్నారో వివరాలు ఇవ్వాలనడం దారుణమన్నారు. ఉపాధ్యాయుల ధర్నాలో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో నాయకులు కె.రాజ్‌కుమార్, వి.ధర్మరాజు, ఎంఎన్ శ్రీనివాస్, బి.మనోజ్‌కుమార్, జి.వెంకటేశ్వరరావు, వి.కనకదుర్గ, బి.సుభాషిణి, వీబీవీఎస్ సుబ్రహ్మణ్యం, ఆర్.రవికుమార్ తదితరులు ఉన్నారు.
Advertisement
Advertisement