దోమలపై పరీక్ష.. విద్యార్థులకు శిక్ష
Published Sat, Oct 1 2016 10:56 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
– కలెక్టర్ ప్రకటనపై విస్మయం
– వార్షిక పరీక్షల్లో మార్కులు కలపడం ఎలా సాధ్యం
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
దోమలపై దండయాత్ర పేరిట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు నుంచి ప్రచార యాత్ర మొదలుపెడితే.. జిల్లా యంత్రాంగం మరో అడుగు ముందుకు వేసింది. దోమలపై విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. 50 మార్కులకు పరీక్ష నిర్వహించి, ఈ మార్కులను వార్షిక పరీక్షల్లో సైన్స్ సబ్జెక్ట్‌లో కలుపుతామని కలెక్టర్ కాటంనేని భాస్కర్ ప్రకటించారు. నాలుగు రోజుల క్రితం విద్యాశాఖ ప్రచురించిన ‘దోమలపై దండయాత్ర–పరిసరాల పరిశుభ్రత’ ప్రచార పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంలో కలెక్టర్ ఈ ప్రకటన చేశారు. నవంబర్ 1వ తేదీన విద్యార్థులకు దోమలపై పరీక్ష నిర్వహిస్తామని, దీనికోసం ప్రత్యేక పుస్తకాన్ని కూడా రూపొందిస్తామని ప్రకటించారు. దోమలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం మంచి కార్యక్రమమే అయినా దోమల్ని అంతమొందించేందుకు ప్రభుత్వ శాఖల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాలను గాలికొదిలేసి విద్యార్థులకు అవగాహన కల్పించి చేతులు దులిపేసుకుంటే ప్రయోజనం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు దోమలపై దండయాత్ర కార్యక్రమం ప్రారంభించగా.. ఇప్పటికీ జిల్లాలో ఎక్కడా పారిశుద్ధ్య పరిస్థితులు మెరుగుపడలేదు. ముఖ్యమంత్రి పర్యటన తర్వాత ఏలూరులో దోమలు తగ్గకపోగా.. బాగా పెరిగాయని నగరవాసులు గగ్గోలుపెడుతున్నారు.
మార్కులు కలపడం సాధ్యమేనా!
1æనుంచి 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా పరీక్ష నిర్వహించే అధికారం జిల్లా యంత్రాంగానికి ఉందా.. అంటే లేదనే సమాధానం వస్తోంది. దోమలపై పరీక్ష నిర్వహించి.. వార్షిక పరీక్షల్లో 50 మార్కులు కలుపుతామని ప్రకటించారు. వార్షిక పరీక్షల్లో మార్కులు కలిపే అధికారం డీఈవోకు గాని, కలెక్టర్‌కు గాని ఉండదు. ఇలాంటప్పుడు ప్రచారం కోసం విద్యార్థులను ఇబ్బంది పెట్టడం.. మార్కుల పేరిట వారిని మోసగించటం సరికాదని విద్యావేత్తలు అంటున్నారు. వార్షిక పరీక్షల్లో మార్కులు కలపడం వీలు పడదని డీఈవో డి.మధుసూదనరావు సైతం చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్ష పెడతారా.. లేక ఎప్పటిలా నాలుగు రోజులు హడావుడి చేసి ఊరుకుంటారా వేచి చూడాల్సిందే.
Advertisement