టీచర్లకూ ‘పరీక్ష’ | exams to teachers | Sakshi
Sakshi News home page

టీచర్లకూ ‘పరీక్ష’

Published Thu, Aug 11 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM

సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ నేత గుణశేఖర్‌రెడ్డి

సమావేశంలో మాట్లాడుతున్న యూటీఎఫ్‌ నేత గుణశేఖర్‌రెడ్డి

– ఆన్‌లైన్‌ టెస్టు ఇప్పుడొద్దంటున్న టీచర్లు
–  పరీక్షలు సెలవుల్లో జరపాలని డిమాండ్‌ 
– 20,21 జరిగే ఆన్‌లైన్‌ పరీక్ష రద్దు చేయాలని విన్నపం
– ఆందోళనలో ఉపాధ్యాయులు
 
చిత్తూరు (ఎడ్యుకేషన్‌):
రాష్ట్రంలోని ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ప్రై వేటు యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్న టీచర్లకు ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించే ఆన్‌లైన్‌ (కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు) ఇప్పుడొద్దని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘ నేతలు డిమాండ్‌ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన పలు సర్వేల ప్రకారం ఏపీ విద్యా ప్రమాణాల్లో వెనుకబడి ఉన్నట్లు తేలింది. ప్రధానంగా ఇంగ్లీషు, గణితం, సైన్సు సబ్జెక్టుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు ఆ సర్వేలు వెల్లడించాయి. ఈ సర్వే ఆధారంగా రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న స్కూల్‌ అసిస్టెంట్లకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షాఅభియాన్‌ (ఆర్‌ఎస్‌ఎంఏ) ద్వారా శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఉపాధ్యాయులు ఏ విషయాల్లో వెనుకబడి ఉన్నారో గుర్తించడానికి ట్రై నింగ్‌ నిడ్స్‌ ఐడింటిఫికేషన్‌ టెస్టు (టీఎన్‌ఐటీ) ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించడానికి విద్యాశాఖ రంగం సిద్ధం చేస్తోంది. ప్రభుత్వ, ప్రై వేటు యాజమాన్యాల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్‌ టీచర్లందరూ ఈ పరీక్ష రాయాల్సిందేనని రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు ద్వారా స్పష్టం చేశారు.  ఈ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) అమలులో భాగంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ ఒకే ప్రశ్నాపత్రంతో కూడిన కామన్‌ పరీక్షలను జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పాఠశాలల్లో నిర్వహించే త్రై మాసిక (ఎస్‌ఏ–1), అర్థసంవత్సరం (ఎస్‌ఏ–2), వార్షిక పరీక్షలు (ఎస్‌ఏ–3)  రాష్ట్రం మొత్తం ఈ ఏడాది ఒకే విధమైన ప్రశ్నాపత్రాలతో పరీక్షలను జరపనున్నారు. కేంద్రం నిర్వహించిన పలు సర్వేల్లో ఏపీలో విద్యాప్రమాణాల్లో చిట్టచివరి స్థానంలో ఉన్నట్లు ప్రకటించింది. ఆసర్వే ఆధారంగా తీసుకున్న ప్రభుత్వం ఉపాధ్యాయుల్లో నైపుణ్యాలను గుర్తించి వారికి శిక్షణ ఇస్తే విద్యాప్రమాణాలు పెరుగుతాయని ఈ నిర్ణయం తీసుకుంది. 
ఆందోళనలో టీచర్లు
సామర్థ్యాల ముదింపునకు ప్రభుత్వం నిర్వహించనున్న ఆన్‌లైన్‌ పరీక్షపై టీచర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఈ విధానంపై టీచరదరూ పలు అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను పరిగణలోకి తీసుకోకుండా విద్యాప్రమాణాల వెనుకబాటుకు టీచర్లను బాధ్యులను చేయడం తగదన్నారు. దశాబ్ధాల క్రితం అప్పటి సిలబస్‌ ఆధారంగా ఉత్తీర్ణులైన తమకు ఇంటర్మీడియట్‌ సిలబస్‌ను నిర్ణయించి పరీక్ష రాయమంటే ఎలా రాయాలని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది టీచర్లకు కంప్యూటర్‌ పై అవగాహన లేకపోవడంతో ఈ పరీక్షపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆకస్మాత్తుగా పరీక్ష ఉంటుందని చెబితే ఎలా రాయాలని ప్రశ్నిస్తున్నారు..? వార్షిక సెలవుల్లో జరపాల్సిన ఇటువంటి విధానాలు విద్యాసంవత్సరం జరిగే సమయంలో పెట్టడం అన్యాయమని చెబుతున్నారు. 
 
టీఎన్‌ఐటీ సెలవుల్లోనే నిర్వహించాలి – ఏహెసానుల్లా, ఆప్టా జిల్లా అధ్యక్షులు
ప్రభుత్వం జరపబోయే టీఎన్‌ఐటీ పరీక్షను సెలవుల్లోనే నిర్వహించాలి. ఆన్‌లైన్‌ పరీక్ష పేరుతో ప్రభుత్వం టీచర్లను భయాందోళనకు గురి చేస్తోంది. ఆ విధానం వలన టీచర్లు తరగతులు చెప్పడంలో ఏకాగ్రతను కోల్పోతున్నారు. కంప్యూటర్‌ పరిజ్ఞానం కల్పించిన తరువాత ఇటువంటి పరీక్షలను పెట్టాలి. 
ఆన్‌లైన్‌ పరీక్ష వద్దు
శ్రీకాళహస్తి టౌన్‌ :  స్కూల్‌ అసిస్టెంట్లు ఇప్పటికే అనేక పనులతో అవస్థలు పడుతుంటే వారిని అవమానించే విధంగా ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించడం మానుకోవాలని యూటీఎఫ్‌  జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లందుల గుణశేఖర్‌ రెడ్డి కోరారు. గురువారం పట్టణంలోని జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఉపాధ్యాయులకు ఆన్‌లైన్‌ పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఒక వింత ఆలోచన  చేస్తోందని, ఈ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. అలా కాని పక్షంలో దీన్ని ఫ్యాప్టో ఆధ్వర్యంలో బహిష్కరిస్తామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయులకు వృత్యంతర శిక్షణలో కంప్యూటర్‌ విద్యపై అవగాహన కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రేషనలైజేషన్‌ పేరుతో పేద విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేసే కుట్ర జరుగుతోందని, దీన్ని ఉపాధ్యాయులు ఎదుర్కోవాలని,సీపీఎస్‌ విధానాన్ని రద్దు చేసేంత వరకు పోరాడాలని కోరారు. అలాగే ఉమ్మడి సర్వీస్‌ రూల్స్‌ను ప్రభుత్వం వెంటనే తీసుకురావాలని, ప్రమోషన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌  జిల్లా కార్యదర్శి కె.ఎస్‌.బి.సూర్యప్రకాష్, పట్టణ అధ్యక్షుడు రమణయ్య, ప్రధాన కార్యదర్శి కె.ఈశ్వర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు  కె,సుబ్రమణ్యంరెడ్డి పాల్గొన్నారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement