
'ఆ గ్రామాల పరిధిలో 194 ఎకరాలకు మినహాయింపు'
విజయవాడ : 1954 కన్నా ముందు అన్ కండిషన్ అసైన్డ్ భూములు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు అని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు. కండిషన్ భూములను మాత్రం కొనుగోలు చేయడంపై నిషేధం ఉందన్నారు. శనివారం విజయవాడలో పి.నారాయణ మాట్లాడుతూ... రాజధాని ప్రాంతంలోని నాలుగు గ్రామాలైన లింగాయపాలెం, నేలపాడు, వెలగపూడి, పిచ్చుకలపాలెం పరిధిలోని 194 ఎకరాలకు మినహాయింపు ఇచ్చినట్లు చెప్పారు.
1974 నుంచి ఈ గ్రామాల పరిధిలో పలువురు అనుభవదారులుగా ఉన్నారని ఈ సందర్భంగా నారాయణ గుర్తు చేశారు. వారికి గతంలోనే పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరిగాయన్నారు. వీటిలో 2014 జులై నుంచి అనుభవదారులుగా ఉన్నవారినే గుర్తిస్తామన్నారు. వారికి ప్యాకేజీ కింద 5000 గజాల నివాస స్థలంతోపాటు 50 గజాల వాణిజ్య స్థలం కేటాయిస్తామని పి.నారాయణ వెల్లడించారు.