కానిస్టేబుల్ రాత పరీక్షకు కసరత్తు
Published Wed, Jan 18 2017 11:42 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
- ఈ నెల 22, 29 తేదీల్లో నిర్వహణ
- మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టేందుకు బయోమెట్రిక్ స్కానింగ్ అమలు
- హాజరుకానున్న కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల అభ్యర్థులు
కర్నూలు: పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షకు పోలీసు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. సివిల్, ఏఆర్ కానిస్టేబుల్, జైలు వార్డెన్ నియామక దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 20తో ముగిశాయి. మొత్తం 221 పోస్టులు భర్తీకి కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించిన అభ్యర్థులు 16,800 మందికి కర్నూలులోనే రాత పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం కర్నూలులో 27 సెంటర్లు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ కమ్యూనికేషన్ విభాగంలో 494 మహిళా, పురుష కానిస్టేబుల్ పోస్టులకు దేహదారుఢ్య పరీక్షలు పూర్తయ్యాయి. అందులో 14,776 మంది రాత పరీక్షకు ఎంపికయ్యారు. వారికి 29వ తేదీన మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందుకోసం ఏర్పాట్లలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యారు. పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతుంది. అయితే అంతకుముందే అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, ఇతర వస్తువులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో పాటు ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డు పరీక్ష కేంద్రం వద్ద చూపితేనే లోనికి అనుమతిస్తారు.
బయోమెట్రిక్ స్కాన్ విధానం అమలు...
పరీక్షలలో రకరకాలుగా జరిగే మాల్ ప్రాక్టీస్‌లు మోసాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ స్కానింగ్ విధానాన్ని అమలు చేయనున్నారు. కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకు సంబంధించి సుమారు 94 మందిని పరీక్షా కేంద్రాల్లో బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లుగా నియమించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో వారందరికీ బయోమెట్రిక్ వేలిముద్ర సేకరణపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాగ్నటిక్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి హాజరైన భాస్కర్.. బయోమెట్రిక్ విధానం గురించి వివరించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల హాల్‌టిక్కెట్లపై ఉండే బార్‌కోడ్‌ను బయోమెట్రిక్ స్కాన్ చేసిన తర్వాత అభ్యర్థి పూర్తి వివరాలను ధ్రువీకరించనున్నారు. బయోమెట్రిక్ ద్వారా ఎడమ, కుడి చేతి చూపుడు వేలి ముద్రలను తీసుకుంటారు. ఒక అభ్యర్థి బదులు మరొక అభ్యర్థి పరీక్ష రాయడం వంటి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడకుండా ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. వర్క్‌షాప్ కార్యక్రమానికి ఎస్పీ ఆకే రవికృష్ణ హాజరై ఇన్విజిలేటర్లకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బయోమెట్రిక్ వేలిముద్రల సేకరణలో అప్రమత్తంగా ఉండాలని, ఎలక్ట్రానిక్ పరికరాలను ఎలాంటి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఐ.వెంకటేష్, సీసీఎస్ సీఐ ఓబులేసు, ఫింగర్ ప్రింట్స్ సీఐ ఆర్.శివారెడ్డి, ఈ–కాప్స్ సిబ్బంది, ఐటీ కోర్ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement