సీఎం పర్యటన వేళ.. పేలుడు పదార్థాల కలకలం!
- మహ్మదాబాద్‌లో భారీస్థాయిలో స్వాధీనం
- పోలీసుల దాడిలో లభ్యమైన పేలుడు పదార్థాలు
- శుక్రవారం చౌటుప్పల్‌లో కేసీఆర్ పర్యటన
సంస్థాన్ నారాయణపురం : నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలం గుజ్జ గ్రామంలో 3 రోజుల క్రితం వాల్‌పోస్టర్ల కలకలం మరువక ముందే మహ్మదాబాద్ గ్రామపరిధిలోని దుబ్బళ్ల గ్రామంలో పెద్దఎత్తున లభ్యమైన పేలుడు పదార్థాలు కలకలం సృష్టించాయి. అజ్ఞాత వ్యక్తి సమాచారం మేరకు ఎస్సై పి.అశోక్‌కుమార్ నేతృత్వంలో బుధవారం రాత్రి దుబ్బళ్లలో మల్లెపల్లి లకా్ష్మరెడ్డి కోళ్లఫారమ్‌పై దాడులు నిర్వహించారు. అరగంట అయితే వేరే ప్రాంతానికి తరలిపోయే ఈ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిట్యాల మండలం వెలిమినేడు, నార్కట్‌పల్లి మండలాల్లో ఉన్న ఐడియల్ ఎక్స్‌ప్లోజివ్ కంపెనీకి చెందిన పేలుడు పదార్థాలు లభ్యమైనట్లు, జూన్ 29న ఇవి వెలిమినేడు నుంచి దుబ్బళ్లకి చేరినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎలక్ట్రానిక్ డిటోనేటర్స్ ఐడియల్ కంపెనీవి 500, గల్ఫ్ కంపెనీవి 1,915, ఈడీ కనెక్టర్స్ 400, డిటోనేటర్స్ కనెక్టర్స్ 2000, ఐడియల్ పవర్‌జెల్ 7 కాటన్లు(1482 ప్యాకెట్లు), డిటోనేటర్ ఫ్యూజ్ వైర్లు 4 బండిళ్లు(ఒక్కొక్కటీ 375 సెం.మీ.), అమ్మోనియం నైట్రేట్ 350 కిలోలను (7 బస్తాలు) స్వాధీనం చేసుకుని నారాయణపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఐడియల్ కంపెనీ యజమాని ఎలిమినేటి శ్రీనివాస్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారు పరారీలో ఉన్నారు. శ్రీనివాస్‌రెడ్డిపై చిట్యాల, సైబర్‌బాద్‌లో కూడా కేసులు నమోదయ్యాయి. గ్రామంలో పేలుడు పదార్థాల్ని అక్రమంగా నిల్వ ఉంచడం, అక్రమ తరలింపు వంటి ఆరోపణలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. వీటిని సురక్షితంగా ఉంచడానికి వెలిమినేడుకు తరలించారు.
సీఎం పర్యటనకు ఏమైనా లింకుందా?
హరితహారంలో భాగంగా శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ చౌటుప్పల్ పర్యటన నేపథ్యంలో.. ఈ పేలుడు పదార్థాలు దొరకడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం పర్యటనకు ఈ పేలుడు పదార్థాలకు ఏమైనా లింకు ఉందా?.. 3 రోజుల క్రితం గుజ్జ గ్రామంలో ఆర్‌ఎన్‌వై పేరుతో వాల్‌పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఈ సంఘటనకు, గుజ్జ సంఘటనకు 4 రోజుల తేడా ఉండడం, ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా చోటు చేసుకున్న పరిణామాలు అనుమానాస్పదంగా మారాయి. కాగా., రాళ్లు పగలకొట్టడానికి వ్యాపారం నిమిత్తం అమ్మకాలు చేస్తున్నారని పోలీసులు అంటున్నారు. దాడుల్లో ట్రైనీ ఎస్‌ఐలు బీ.కుమారస్వామి, నరసింహ, ఏఎస్‌ఐలు శివాజీరెడ్డి, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, పాండు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.