నేతన్నలను ఆదుకోవడంలో విఫలం
- హామీలన్నిటినీ చంద్రబాబు మగ్గం గుంతలో పాతిపెట్టేశారు!
- సంక్షేమ పథకాలను ఆపేసి కార్మికుల ఆత్మహత్యలకు కారణమయ్యారు
- సెప్టెంబర్ 8వ తేదీలోపు ముడిపట్టు రాయితీ బకాయిలు మొత్తం చెల్లించాలి
- చేనేత ధర్నాలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం (ధర్మవరం టౌన్):
సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని ఆదుకోవడంలో తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు ఎన్నికల హామీలతోపాటు చేనేత దినోత్సవం రోజున నేతన్నలకు ఇచ్చిన హామీలను సైతం మగ్గం గుంతలో పాతిపెట్టారని విమర్శించారు. చేనేత కార్మికులకు ఇవ్వాల్సిన ముడిపట్టురాయితీ బకాయిలు చెల్లించాలంటూ కాంగ్రెస్, సీపీఐ, సీసీఎం, ఆమ్ ఆద్మీ నాయకులతో కలసి ధర్మవరంలోని సెరిఫెడ్ కార్యాలయం ఎదుట వేలాదిమంది చేనేత కార్మికులతో కలసి పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు.
అంతకుముందు ఆయన నివాసం వద్దనుంచి సెరిఫెడ్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి మాట్లాడుతూ ధర్మవరంలో గత ఏడాది చేనేత దినోత్సవం రోజున చేనేత కార్మికులకు ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000 పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారని గుర్తు చేశారు. పెంచిన ముడిపట్టు రాయితీ మొత్తాన్ని నెలనెలా కార్మికుల ఖాతాల్లోకి జమ చేయాల్సి ఉందన్నారు. అయితే ఆరు నెలలుగా జమ చేయడం లేదన్నారు. ముడిపట్టు రాయితీ రూ.600 చొప్పున 12 నెలల బకాయిలు, రూ.1,000 చొప్పున ఆరు నెలల బకాయిలు మొత్తం రూ. 17.48 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ మొత్తాన్ని విడుదల చేసి ఉంటే స్థానిక టీడీపీ నాయకుల జేబుల్లోకి చేరిందా.. లేక విడుదల చేయకుండా చంద్రబాబు చేనేతలను మోసం చేస్తున్నారా.. అనేది తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.
చేనేత నిర్వీర్యానికి కుట్ర
చేనేత వ్యవస్థను నమ్ముకుని జిల్లాలో 5 లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయని, వ్యవసాయం తరువాత అధిక సంఖ్యాకులు ఆధారపడి జీవిస్తున్న రంగాన్ని తెలుగుదేశం పార్టీ పూర్తిగా నిర్వీర్యం చేసిందని కేతిరెడ్డి మండిపడ్డారు. అప్పటి దాకా అమలవుతున్న లాంబార్డ్ స్కీంను ఎత్తివేశారని, కమీషన్ల పంపిణీలో తేడాలు వచ్చి ఎన్‌హెచ్‌డీసీ పథకానికి మంగళం పాడారని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చకపోగా.. ఉన్న సంక్షేమ పథకాలు నిలిపివేసి నేతన్నల ఆత్మహత్యలకు కారణమవుతున్నారని దుయ్యబట్టారు. చేనేతలపై కేంద్రం జీఎస్టీ భారం మోపితే ఏ ఒక్క టీడీపీ నాయకుడూ నోరుమెదపలేదన్నారు. సెప్టెంబర్ 8వ తేదీలోపు పెండింగ్ బకాయిలు మొత్తం చేనేత కార్మికుల ఖాతాల్లోకి జమచేయకపోతే అందోళన చేపడతామన్నారు. వారికి న్యాయం జరిగే వరకు ఆఫీస్ ఎదుటే దీక్షలు చేస్తామన్నారు.
అనంతరం ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు పోలా రామాంజనేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు జింకాచలపతి, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ రంగన అశ్వర్థనారాయణలు మాట్లాడుతూ దేశంలోనే చేనేత కార్మికులు, రైతుల ఆత్మహత్యలలో ఏపీని అగ్రగామిగా నిలుపుతున్నారని ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తారు. అనంతరం ఓఎస్‌డీ అచ్చన్నకు వినతిపత్రం అందజేశారు.
కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యులు గిర్రాజు నగేష్, చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు బీరే ఎర్రిస్వామి, పట్టణ కార్యదర్శి జింకా కంబగిరి, రైతు సంఘం నాయకులు జంగాలపల్లి పెద్దన్న, వైఎస్సార్‌సీపీ నాయకులు గడ్డం కుళ్లాయప్ప, చందమూరి నారాయణరెడ్డి, బీరే జయచంద్ర, గుర్రం రాజ, లాయర్, కిష్టయ్య, యుగంధర్, శంకర తేజ, బాలం గోపాల్, బడిమెల మూర్తి, గాజుల శంకర్, శీలా రాయుడు, డోల్ సత్తి, యల్లయ్య, జీఆర్ రామ్మోహన్, కొళ్లమోరం చంద్రశేఖరరెడ్డి, జింకా రాఘవేంద్ర, శంకర్, సత్తి, తొండమల రవి, పురుషోత్తంరెడ్డి, మేడాపురం వెంకటేష్, కుమారస్వామి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.