నకిలీ పహణీ సూత్రధారుల అరెస్ట్
-
బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో వెలుగులోకి..
వర్ధన్నపేట టౌన్ : నకిలీ పహణీలు తయారు చేసి రుణాల కోసం రైతులకు అందించిన ముగ్గురిని గురువారం అరెస్టు చేసినట్లు వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ తెలిపారు. ఇల్లందలోని మీసేవ కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ ఆడెపు కేశవ్, చంద్రుతండాకు చెందిన మధ్య దళారి మాలోతు వీరస్వామి, నకిలీ పహణీ తీసుకున్న మూడుగుళ్ల తండాకు చెందిన రైతు బానోతు దేసునాయక్ అరెస్ట్‌ను పోలీస్ సర్కిల్ కార్యాలయంలో విలేకరుల ఎదుట చూపారు. సీఐ కథనం ప్రకారం.. ఇల్లందలోని కేజీవీబీలో దేసునాయక్ పంట రుణం ఎక్కువగా కావాలని బ్యాంకు మేనేజర్‌ను కోరాడు. భూ విస్తీర్ణాన్ని బట్టి లోన్ ఇస్తామని మేనేజర్ చెప్పారు. గతంలో అతడికి రూ. 35 వేల రుణం ఉంది. ఇది గమనించిన మధ్యదళారి, ప్రస్తుతం రాంధన్‌తండా మహిళా సంఘాల సీఏగా పని చేస్తున్న వీరస్వామి.. ఎక్కువ రుణం ఇప్పిస్తానని, అందుకు కొంత డబ్బు ఖర్చవుతుందని చెప్పగా దేసునాయక్ ఒప్పుకున్నాడు. ఆ తర్వాత వీరస్వామి రైతు వద్ద పహణీ కాపీలు తీసుకుని ఇల్లంద మీసేవా కేంద్రం ఆపరేటర్ కేశవ్‌ను కలిసి పహణీలో భూమి విస్తీర్ణాన్ని పెంచాలని కోరాడు. పర్వతగిరి మండలం రోళ్లకల్లు శివారులో దేసునాయక్‌కు 121/ఎ సర్వే నంబర్‌లో 0.12 ఎకరాలు ఉండగా దానిని 2.12 ఎకరాలుగా, 137/బిలో 0.16 ఎకరాలు ఉండగా దానిని 1.16 ఎకరాలుగా మార్చాడు. ఈ నకిలీ పహణీతో బ్యాంకుకు వెళ్లిన దేసునాయక్ రుణం పెంచాలని మేనేజర్‌ను కోరాడు. దీంతో అనుమానం వచ్చిన మేనేజర్ తహసీల్దార్‌ను సంప్రదించగా రికార్డులు, కంప్యూటర్ పహణీలను పరిశీలించగా నకిలీవని గుర్తించారు. దీంతో వర్ధన్నపేట రెవెన్యూ అధికారులు మీ సేవా కేంద్రాన్ని సీజ్ చేశారు. బ్యాంకు మేనేజర్ దాసునాయక్ గత నెల 28న వర్ధన్నపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారణ చేసి పై ముగ్గురిని నిందితులుగా గుర్తించి అరెస్టు చేసి గురువారం రిమాండ్‌కు తరలించారు. ఈ కేసుపై లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆయన వెంట వర్ధన్నపేట ఎస్సై రవిరాజు తదితరులు ఉన్నారు.