నకిలీ విత్తనాలతో నట్టేట మునిగాం
నకిలీ విత్తనాలతో నట్టేట మునిగాం
Published Tue, Mar 7 2017 1:27 AM | Last Updated on Tue, Sep 5 2017 5:21 AM
లింగపాలెం: కల్తీ మిర్చి విత్తనాలు ఇచ్చి దుకాణ యజమాని తమను మోసగించారంటూ పలువురు రైతులు ఫిర్యాదు చేశారని జిల్లా ప్లాంట్ ప్రొడక్షన్ డీడీఏ బీజీవీ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ధర్మాజీగూడెంలోని సాయి శివ సీడ్స్ షాపులో రికార్డులు, బిల్లులను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లి గ్రామానికి చెందిన 15 మంది రైతులు ధర్మాజీగూడెం సాయి శివ సీడ్స్ దుకాణంలో సన్‌స్టార్ కంపెనీకి చెందిన ‘లక్ష్మి 90’ రకం మిర్చి విత్తనాలను కొద్దినెలల క్రితం కొనుగోలు చేశారన్నారు. ఈ విత్తనాలతో 21 ఎకరాల్లో మిరప సాగు చేయగా సక్రమంగా మెలకలు రాక, చెట్లు పూత పూయక దిగుబడులు తగ్గి తీవ్రంగా నష్టపోయినట్టు రైతులు ఫి ర్యాదు చేశారని చెప్పారు. తమకు జరిగిన నష్టంపై కంపెనీ ప్రతినిధులు, డీలర్‌కు పలు మార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారన్నారు. ఈ మేరకు తాను విచారణ చేపట్టానని చెప్పారు. దుకాణ యజమాని వి.రామకృష్ణ నుంచి వివరాలు సేకరించామని, నివేదికను కలెక్టర్, జేడీకి అందజేస్తానని డీడీఏ ప్రసాద్ చెప్పారు. చింతలపూడి ఏడీఏ పీజీ బుజ్జిబాబు, ఏవో డి.రాధిక, ఏఈవో సిద్దయ్య ఉన్నారు.
డీలర్లపై చర్యలకు డిమాండ్
ఏలూరు (సెంట్రల్): నకిలీ విత్తనాలు అమ్మిన డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని, నకిలీ విత్తనాలతో నష్టపోయిన తమకు నష్టపరిహారం ఇవ్వాలని కృష్ణా జిల్లా ముసునూరు మండలం వలసపల్లి గ్రామానికి చెందిన మిర్చి రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్ పిచ్చుక ఆదిశేషు మాట్లాడుతూ వలసపల్లి గ్రామానికి చెందిన 17 మంది రైతులు నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయారని, వీరిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీ పి.కోటేశ్వరరావుకు వినతిపత్రం సమర్పించారు. రైతులు గొల్లపల్లి బాలస్వామి, సొంగా మధు, సుబ్బారావు, కె.వెంకటేశ్వరరావు, పా మర్తి ప్రసాద్, వీర్ల కృష్ణవేణి, కొల్లేటి రాజు, చలసాని మురళీకృష్ణ తదిత రులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement