నకిలీ విత్తనాల కలకలం
నకిలీ విత్తనాల కలకలం
Published Sat, Jul 30 2016 5:12 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
మంత్రి ఇలాకాలో రైతన్న కుదేలు
రెండువేల ఎకరాల్లో ఎండిన పత్తి మొక్కలు
కోట్ల రూపాయల పెట్టుబడులు మట్టిపాలు
పరిహారం ఇప్పించాలని కోరుతున్న అన్నదాతలు
సాక్షి, అమరావతి : జిల్లాలో నకిలీ విత్తనాలు అన్నదాతల్లో కలకలం రేపుతున్నాయి. సాక్షాత్తూ వ్యవసాయ శాఖ మంత్రి సొంత ఇలాకాలోనే పత్తి పంట సాగు చేసిన రైతులకు చుక్కెదురైంది. ‘కావేరి జాదు’ పత్తి విత్తనాలు సాగు చేసిన రైతులు నిలువునా మునిగిపోయామని చెబుతున్నారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని కొమటినేనివారిపాలెం, కావూరు, పసుమర్రు, మానుకొండువారిపాలెం, తిమ్మాపురం, అబ్బాపురం, గణపవరం, అమీన్ షాహెబ్‌పాలెం, తూపాడు, నాదెండ్ల గ్రామాల్లో ఈ విత్తనాలు సాగు చేసిన రైతులు ఆందోళనకు గురవుతున్నారు.
పోలీసులకు ఫిర్యాదు...
ఇక్కడ దాదాపు రెండువేల ఎకరాల్లో రైతులు పంటను సాగు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో పత్తి మొక్కలు ఎండిపోవటంతో పాటు, ఎదుగుదల సైతం లేదు. కొన్నిచోట్ల మొక్కలు ఒరిగిపోవటంతో పాటు రంగుమారిపోవడం రైతుల్లో ఆందోళనతో పాటు అనుమానాలు రేకెత్తించింది. కొమటినేనివారిపాలెంలో వర్షాభావ పరిస్థితుల్లో మొక్కలు ఎండిపోయాయనే భావనతో రైతులు రెండోసారి ఇదే కంపెనీ విత్తనాలు నాటారు. మొక్కలు ఎండిపోవటం తప్ప మార్పు కనిపించలేదు. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రతినిధులను పిలిపించి పంటను చూపారు. వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో పరిహారం చెల్లించాలని గ్రామస్తులు ఈ నెల 19న వారిని నిర్బంధించారు. పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేశారు. నరసరావుపేట రూరల్ మండలంలో కూడా ఈ రకం విత్తనాలు సాగు చేసిన రైతుల పరిస్థితి ఇలాగే ఉన్నట్లు సమాచారం.
సర్కారు తీరుపై రైతుల ఆవేదన..
రైతులు వ్యవసాయశాఖ అధికారులు, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుకు ఫిర్యాదు చేయడంతో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. శాస్త్రవేత్తల బృందంతో పంటను పరిశీలించారు. జూన్‌లో వచ్చిన వేడి గాలులు, నేలలో తేమ శాతం తగ్గడం, శిలీంధ్రాలు, మైక్రో న్యూట్రాన్స్ సక్రమంగా లేకపోవటం వల్లే జాదు కంపెనీ రకం విత్తనాలు తట్టుకోలేకపోయాయనే నిర్ణయానికి వచ్చారు. అయితే చిలకలూరిపేటలో సాధారణ వర్షపాతం నమోదవటం, మొక్కలు ఎండిపోయిన పక్క పొలాల్లో వేరే రకం పత్తి విత్తనాలు వేసిన వారి పంట బాగుండటం అనుమానాలు రెకేత్తిస్తోంది. కంపెనీ ప్రతినిధులకు వత్తాసు పలికేలా ప్రభుత్వం వ్యవహారం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నష్టపోయినవారిలో ఎక్కువ శాతం కౌలు రైతులే ఉండటం గమనార్హం. ఎకరానికి సంబంధించి కౌలు రూ.15 వేలు, విత్తనాలు, ఎరువులు కలిపి రూ.10 వేలు మొత్తం రూ.25 వేలకు నష్టపోయినట్లు రైతులు పేర్కొంటున్నారు. మొత్తంగా కోట్ల రూపాయల పెట్టుబడులు మట్టిపాలయ్యాయని ఆవేదన చెందుతున్నారు.
కంపెనీకి నోటీసులు జారీ చేశాం..
కావేరి జాదు పత్తి విత్తనాల వ్యవహారం మా దృష్టికి వచ్చింది. పంటలను పరిశీలించేందుకు శాస్త్రవేత్తల బృందాలను పంపించాం. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. పత్తి విత్తనాలు సరఫరా చేసిన కంపెనీకి నోటీసులు జారీ చేశాం. పూర్తిస్థాయి నివేదిక అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం. రైతులు సైతం వ్యవసాయశాఖ సర్టిఫై చేసిన విత్తనాలనే వేసుకోవాలి.
– కృపాదాసు, వ్యవసాయ సంయుక్త సంచాలకులు, గుంటూరు జిల్లా
Advertisement
Advertisement