కల్తీ విత్తనాలతో ముప్పు
కల్తీ విత్తనాలతో ముప్పు
Published Sun, May 7 2017 11:29 PM | Last Updated on Tue, Aug 28 2018 7:22 PM
తగ్గుతున్న దిగుబడులు
మేనేజ్ డైరెక్టర్ అమరేంద్రరెడ్డి
గొల్లప్రోలు (పిఠాపురం) : కల్తీ, నకిలీ విత్తనాలు వల్ల పంట దిగుబడులు తగ్గుతున్నాయని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్‌టెంట్ మేనేజ్‌మెంట్ (మేనేజ్) డైరెక్టర్ అమరేంద్రరెడ్డి తెలిపారు. ఆర్గనైజేషన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో మేనేజ్ డైరెక్టర్ అమరేంద్రరెడ్డి నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల బృందం గొల్లప్రోలులో ఆదివారం పర్యటించింది. స్థానిక వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయం వద్ద రైతులు నుంచి సమగ్ర సమాచారం సేకరించారు. రైతులు సాగుచేస్తున్న వరి వంగడాలు, దిగుబడులుపై అధ్యయనం చేశారు. ఖరీఫ్, రబీలో ఎదురైన సమస్యలు, తెగుళ్లపై వివరాలు సేకరించారు. సరాసరి పెట్టుబడి, దిగుబడిపై అంచనాలు వేశారు. అనంతరం అమరేంద్రరెడ్డి మాట్లాడుతూ శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా తమ బృందం పర్యటిస్తుందన్నారు. ఇప్పటి వరకూ కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటన పూర్తి చేశామన్నారు. గొల్లప్రోలు మండలంలో మూడు రోజులు పాటు పర్యటిస్తామని చెప్పారు.
ఖరీఫ్‌లో అత్యధికంగా సాగుచేస్తున్న సాంబమసూరి (బీపీటీ 5204)కు ప్రత్యామ్నాయంగా 2011లో రూపొందించిన ఆర్‌పీ బయో 226 రకం మంచి దిగుబడినిస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా ఎండాకు తెగులును సమర్ధంగా ఎదుర్కోవడంతో పాటు ఎకరాకు 5 నుంచి 10 బస్తాలు అధిక దిగుబడులు వస్తుందన్నారు. గత రెండు మూడేళ్లుగా ఆర్‌పీ బయోలో కేళీలు అధికంగా రావడం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. కల్తీ, నకిలీ విత్తనాలు నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు 500 మంది రైతుల అభిప్రాయాలు తెలుసుకున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అసిస్టెంట్ బాలాస్వామి, ఎంపీఈఓ రాజేష్ తదితరులు ఉన్నారు.
Advertisement