రైతన్న వెన్ను విరిచారు..
రైతన్న వెన్ను విరిచారు..
Published Tue, Nov 1 2016 5:37 PM | Last Updated on Mon, Sep 4 2017 6:53 PM
* వరిలోనూ నకిలీ విత్తనాలు
* 1500 ఎకరాల పైరులో కేళీలు
* సగం దిగుబడి కూడా రాదంటున్న అన్నదాతలు
* నంద్యాల వ్యాపారిపై జేడీకి ఫిర్యాదు
సాక్షి, అమరావతి బ్యూరో: మొన్న పత్తి.. నిన్న మిర్చి.. నేడు వరి... ప్రతి పంటలోనూ నకిలీ విత్తనాలు అన్నదాతలను కలవరపెడుతున్నాయి. జిల్లాలో రోజూ ఎక్కడో ఓ చోట నకిలీల బండారం బయటపడుతూనే ఉంది. కోట్లాది రూపాయల పెట్టుబడులు మట్టిపాలవుతున్నాయి. పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో నకిలీ వరి విత్తనాల బారినపడి 1500 ఎకరాల్లో రైతులు నిండా మునిగారు. పంటలో కేళీలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పొట్ట నుంచి వెన్ను రావడం లేదని, కొన్ని కర్రలకు ముందే వస్తోందని, దీంతో పంట ఎగుడుదిగుడులుగా ఉందని రైతులు వాపోతున్నారు. ముందుగా వచ్చిన గింజలను పిట్టలు తినిపోతున్నాయని పేర్కొంటున్నారు. నానా జాతి విత్తనాలతో మోసపోయామని గగ్గోలుపెడుతున్నారు. ఎకరాలకు 40 బస్తాల దిగుబడి రావాల్సిఉండగా, సగం కూడా వచ్చే పరిస్థితులు లేవని అంటున్నారు. విత్తనాలను నంద్యాలలో తియ్యకూర గోపాలరెడ్డి అనే వ్యాపారి వద్ద బస్తా (30 కేజీలు) రూ. 1000కి కోనుగోలు చేసినట్లు చెబుతున్నారు. పంటలో కేళీలు ఉన్నాయని వ్యాపారికి చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. ఎకరాకు రూ. 20 వేల పెట్టుబడి పెట్టామని వాపోతున్నారు. స్థానిక వ్యవసాయాధికారికి 15 రోజుల ముందే ఫిర్యాదు చేస్తే చర్య తీసుకోలేదని, ఏఈఓకు చెప్పి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జేడీకి ఫిర్యాదు...
వరి పంట వేసి నష్టపోయిన రైతులు సోమవారం గుంటూరులోని వ్యవసాయ సంయుక్త కార్యాలయంలో జేడీ కృపాదాస్‌కు ఫిర్యాదు చేశారు. నకిలీ విత్తనాలతో మోసపోయామంటూ వివరించారు. పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు.
న్యాయం చేస్తాం..
వరి పంటలో కేళీలు, పొట్టనుంచి వెన్ను రావడం లేదని నంబూరు నుంచి రైతులు వచ్చి ఫిర్యాదు చేశారు. వారు ఎక్కడ విత్తనాలు కొన్నదీ, విత్తన బిల్లులను పరిశీలించి వ్యాపారికి ఫోన్ చేశాను. ఆయన వస్తానని చెప్పారు. రైతులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నాను.
– కృపాదాస్, జాయింట్ డైరెక్టర్, వ్యవసాయ శాఖ
Advertisement
Advertisement