కౌలురైతును కాటేసిన కరెంటు
నూనెపల్లె: కౌలుకు తీసుకొన్న పొలంలో సాగు చేసిన పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన ఓ రైతును కరెంట్ కాటేసింది. పాణ్యం మండలం గోరుకుల్లు గ్రామానికి చెందిన హారూన్ రషీద్ (45) పట్టణ శివారులోని ఎస్‌ఆర్‌బీసీ కాలనీ సమీపంలో తొమ్మిది ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. ప్రతి రోజు గ్రామం నుంచి పొలం వద్దకు చేరుకుని పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం పంటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటారు (స్టార్టర్)ను ఆన్ చేసే సమయంలో కరెంటు షాక్ కొట్టడంతో రషీద్ అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య హుసేన్‌బీతో ముగ్గరు పిల్లలు ఉన్నారు. ఆయన మరణంతో కుటుంబానికి ఆసరా ఇచ్చే వారే కరువయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా ఎస్‌ఐ బి.టి.వెంకటసుబ్బయ్య తెలిపారు.