విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Tue, Oct 4 2016 11:29 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
పెద్దఅడిశర్లపల్లి :
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధి హుజూర్‌వారిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూర్‌వారిగూడెంలో రాబోతు అంజయ్య కుమారుడు నరేష్ (32) వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజూ వారి మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్‌ఫార్మర్ ఫీజుకున్న ఏబీ స్విచ్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరా రిటర్న్ అయ్యి ఒక్కసారిగా నరేష్ విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని..
విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నరేష్ మృతిచెందాడని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహించారు. మృతదేహాన్ని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద నున్న విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఏఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకున్న గుడిపల్లి ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, బంధువులతో మాట్లాడి నరేష్ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడు నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
Advertisement
Advertisement