pedda adisharlapalli
-
నల్లగొండ జిల్లాలో దారుణం.. కామాంధుల అకృత్యానికి బాలిక బలి
సాక్షి, నల్లగొండ: కామాంధుల అకృత్యానికి ఓ బాలిక బలైన దారుణ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పదో తరగతి చదువుతున్న హైదరాబాద్‌కు చెందిన బాలిక సంక్రాంతి పండుగకు ఈ నెల 13న పీఏపల్లి మండలంలో ఉంటున్న అమ్మమ్మ ఇంటికి వచ్చింది. తిరిగి మంగళవారం హైదరాబాద్‌కు వెళ్లేందుకు బయల్దేరింది. పెద్ద అడిశర్లపల్లి మండలం వడ్డెరిగూడేనికి చెందిన యువకులు నరేశ్, శివ, దిలీప్లో కారులో అంగడిపేట క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్తుండగా పరిచయస్తులే కావడంతో అక్కడి వరకు వస్తానని బాలిక వారి కారు ఎక్కింది. క్రాస్‌రోడ్డు వద్ద కారు దిగిన బాలిక హైదరాబాద్ వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తుండగా బస్టాప్ ఎదురుగానే నరేశ్‌కు వస్త్ర దుకాణం ఉంది. ఎండలో బస్సు కోసం చూస్తున్న బాలికను అతను తన వస్త్ర దుకాణంలోకి పిలిచాడు. అప్పటికే మిగిలిన ఇద్దరు యువకులూ అదే దుకాణంలోనే ఉన్నారు. కొంత సమయం తర్వాత బాలిక స్పృహ తప్పిపోయిందని ముగ్గురు యువకులూ స్థానిక డాక్టరుకు చూపించగా దేవరకొండకు తీసుకెళ్లాలని సూచించారు. వెంటనే వారు అక్కడికి తరలించగా బాలిక అప్పటికే మృతిచెందిందని డాక్టర్లు నిర్ధారించారు. దీంతో నరేశ్, శివ, దిలీప్‌లు పరారయ్యేందుకు యత్నించగా స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దేవరకొండ డీఎస్పీ నాగేశ్వర్రావు మృతదేహాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు. ముగ్గురు యువకులూ బాలికపై అత్యాచారం చేయడంతోనే తీవ్ర రక్తస్రావంతో మృతిచెందిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. కాగా, తన కూతురును అఘాయిత్యం చేసి హత్య చేశారంటూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చదవండి: పనికోసం నమ్మి వెళ్తే.. ‘బీమా’ ప్లాన్‌లో శవమయ్యాడు.. పాపం ఆ డ్రైవర్! -
ప్రకృతి వనం: సీఐ కాళ్లు పట్టుకున్న రైతులు
పెద్దఅడిశర్లపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని దుగ్యాల గ్రామ పంచాయతీలో ఏర్పాటుచేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం పనులను శనివారం కొందరు రైతులు అడ్డుకున్నారు. అనేక సంవత్సరాలుగా సాగు చేస్తున్న భూముల్లో ఎలాంటి నోటీసులు లేకుండా పనులు ఎలా చేస్తారంటూ అధికారులను నిలదీశారు. దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన రైతులను అరెస్టు చేశారు. అనంతరం అధికారులు పనులు ప్రారంభించారు. వివరాలిలా ఉన్నాయి.. దుగ్యాల గ్రామ శివారులోని 10.24 ఎకరాలను రెవెన్యూ శాఖ బృహత్ పల్లె ప్రకృతి వనం కోసం కేటాయించింది. 1993లో ప్రభుత్వం ఈ భూమిని పేర్వాల ప్రాజెక్టుకు అవసరమైన మట్టికోసం సేకరించింది. మట్టి సేకరించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ భూమిని కోల్పోయిన రైతులే చదును చేసుకొని సాగు చేసుకుంటున్నారు. కాగా పల్లెప్రకృతి వనం ఏర్పాటులో భాగంగా భూమి చుట్టూ కడీలు పాతేందుకు శనివారం ఎంపీఓ మోహన్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్ శివశంకర్ పంచాయతీ సిబ్బందితో కలసి అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకున్న రైతులు కుటుంబ సభ్యులతో కలసి పనులను అడ్డుకున్నారు. దీంతో సీఐ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అనేక ఏళ్లుగా లక్షల రూపా యలు పెట్టుబడి పెట్టి నీటి కోసం పైపులైన్ వేసుకుని సాగు చేస్తున్న భూమిని ఎలాంటి నోటీసు లు లేకుం డా తీసుకోవడం సరికాదని అన్నారు. తమకు చావే శరణ్యమంటూ మహిళలు పోలీసుల కాళ్లు పట్టుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. రైతులు శాంతిం చకపోవడంతో వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. భూములు లాక్కొని తమ పొట్ట కొట్టవద్దని రైతులు అంటున్నారు. -
రోడ్డు ప్రమాద మృతులకు రూ. 25 లక్షలు ఇవ్వాలి: బీజేపీ
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి/కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై గురువారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక నేడు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి జగదీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మృతుల కుటుంబాలను పరామర్శించారు. దేవరకొండ ప్రభుత్వాస్పత్రి వద్ద ఉద్రిక్తత ఇక ప్రమాదంలో మరణించిన వారికి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందిగా బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రి బయట ఆందోళన చేశారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. (చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం: సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి) దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు. సాయంత్రం పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. పెద్దఅడిశర్లపల్లి మండలం అంగడిపేట క్రాస్‌రోడ్ సమీపంలోని ఎస్ఆర్ పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది. -
యురేనియం కోసమే మరోమారు చక్కర్లు కొట్టిన హెలికాప్టర్?
సాక్షి, పెద్దఅడిశర్లపల్లి: యురేనియంపై ప్రజలు మరోసారి అనుమానపడేలా హెలికాప్టర్ చక్కర్లు కొట్టింది. ఈనెల 22న ఓసారి హెలి కాప్టర్ చక్కర్లు కొట్టగా తాజాగా మండలంలోని పెద్దగట్టు, నంబాపురం గ్రామాల్లో మంగళవారం సాయంత్రం సుమారు 3 గం టల ప్రాంతంలో సమయంలో కనిపించిం ది. దీంతో యురేనియం అన్వేషణలో భాగంగానే హెలికాప్టర్ చక్కర్లు కొట్టిందంటూ ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యురేనియం అన్వేషణ, వెలికితీసే చర్యలను మానుకోవా లంటూ ఇప్పటికే ఆయా గ్రామాల ప్రజలు తమ నిరసన తెలుపుతుండగా వారికి ప్రజా సంఘాలు సైతం మద్దతు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో రెండోసారి హెలికాప్టర్ చక్కర్లు కొట్టడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ ఎందుకోసం వచ్చిందో తెలపాలని అధికారులను కోరుతున్నారు. ‘యురేనియం వెలికితీస్తే వినాశనమే’ పెద్దఅడిశర్లపల్లి (దేవరకొండ): యురేనియం వెలికితీయడం వల్ల ప్రజలు, జీవరాశులకు వినాశక పరిణామాలు తప్పవని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం మండలంలోని పెద్దగట్టును ఆయన పరిశీలించి.. యురేనియం వెలికితీయడం వల్ల కలిగే నష్టాలను గ్రామస్తులకు వివరించారు. ఈ సందర్భంగా గతంలో యురేనియం కోసం వేసిన బోరు బావులను ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యురేనియం వెలికి తీస్తే చూస్తూ ఊరుకోబోమని, అడ్డుకుని తీరుతామని చెప్పారు. యురేనియం తవ్వకాలపై కేంద్ర, రాష్ట్రాలు పునరాలోచన చేయాలని సూచించారు. కాంగ్రెస్ పెద్దలు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు రానున్నట్లు వెల్లడించారు. ఆయన వెంట త్రిపురారం జెడ్పీటీసీ భారతిభాస్కర్, ఎంపీపీ పాండరమ్మశ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీలు నారాయణ, సైదులు, మాధవరెడ్డి, నాయకులు బోడ్యానాయక్ ఉన్నారు. -
పెళ్లిలో గొడవ.. తొలి రోజే వధువు ఆత్మహత్య
సాక్షి, నల్గొండ/పెద్దఅడిశర్లపల్లి : ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన నవ వధువు తనువు చాలించింది. పెళ్లి వేడుకలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై పెళ్లి రోజు రాత్రి నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటన పీఏపల్లి మండలంలోని గుడిపల్లిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం గుడిపల్లికి చెందిన బూరుగు వెంకటయ్య, యశోద దంపతుల కుమార్తె కల్పన(23)కు చింతపల్లి మండలం గొడుగుండ్లకు చెందిన రాజుతో ఈ నెల 19న గొడుగుండ్లలో వివాహం జరిగింది. అయితే పెళ్లి రోజున కట్నకానుకల విషయం.. ఇరు కుటుంబీకుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ గొడవతో కల్పన మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన రాత్రి గుడిపల్లిలోని ఇంట్లో నెయిల్ పాలిష్ తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఆస్పత్రికి తరలించగా శనివారం రాత్రి మృతి చెందింది. నవ వధువు మృతితో సందడిగా ఉండాల్సిన ఇంట్లో విషాదం నిండింది. బంధువుల రోదనలతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
పెద్దఅడిశర్లపల్లి : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన పీఏపల్లి మండలం గుడిపల్లి గ్రామపంచాయతీ పరిధి హుజూర్‌వారిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హుజూర్‌వారిగూడెంలో రాబోతు అంజయ్య కుమారుడు నరేష్ (32) వ్యవసాయం చేస్తూ జీవనం గడుపుతున్నాడు. రోజూ వారి మాదిరిగానే తన వ్యవసాయ పొలం వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫీజుకున్న ఏబీ స్విచ్‌ను ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ఓవర్ లోడ్ కారణంగా విద్యుత్ సరఫరా రిటర్న్ అయ్యి ఒక్కసారిగా నరేష్ విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయాడు. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని.. విద్యుత్‌శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే నరేష్ మృతిచెందాడని బంధువులు, గ్రామస్తులు ఆగ్రహించారు. మృతదేహాన్ని అంగడిపేట ఎక్స్‌రోడ్డు వద్ద నున్న విద్యుత్‌సబ్‌స్టేషన్ వద్దకు తీసుకెళ్లి ఏఈ కార్యాలయం ఎదుట బైఠాయించారు. నరేష్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో విషయం తెలుసుకున్న గుడిపల్లి ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులు, బంధువులతో మాట్లాడి నరేష్ కుటుంబానికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్‌రెడ్డి తెలిపారు. మృతుడు నరేష్‌కు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. -
‘పోలీస్ పవర్’లో గుర్రపుతండా విద్యార్థులు
పెద్దఅడిశర్లపల్లి : జొన్నలగడ్డ శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న పోలీస్ పవర్ చిత్రంలోని ఓ ఫైట్ సన్నివేశంలో మండలంలోని పేర్వాల పంచాయతీ పరిధిలోని గుర్రపుతండాకు చెందిన అలేకియా బంజార ఆంగ్ల మాధ్యమ పాఠశాలకు చెందిన 13 మంది విద్యార్థులతో పాటు కరాటే మాస్టర్ రవినాయక్ గురువారం పాల్గొన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ జొన్నలగడ్డ శివ నటిస్తున్నారు. ఫైట్ మాస్టర్‌గా అభిలాశ్ నేతృత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. షూటింగ్లో పాల్గొన్న విద్యార్థులు సునీల్, సురేశ్, నరేశ్, చింటు, జగన్, విజయ్‌కుమార్, సతీశ్, జగన్, అనిల్, ప్రణయ్, ప్రవీణ్, గిరిబాబు, మునిలను పాఠశాల కరస్పాండెంట్ సుజాత నాయక్, ప్రిన్సిపాల్ సామ్యేల్కుమార్, ఉపాధ్యాయులు అభినందించారు.