
ప్రతీకాత్మక చిత్రం..
సాక్షి, నల్గొండ/పెద్దఅడిశర్లపల్లి : ఎన్నో ఆశలతో అత్తారింట్లో అడుగు పెట్టాల్సిన నవ వధువు తనువు చాలించింది. పెళ్లి వేడుకలో జరిగిన గొడవతో మనస్తాపానికి గురై పెళ్లి రోజు రాత్రి నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతిచెందింది. ఈ ఘటన పీఏపల్లి మండలంలోని గుడిపల్లిలో చోటు చేసుకుంది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం గుడిపల్లికి చెందిన బూరుగు వెంకటయ్య, యశోద దంపతుల కుమార్తె కల్పన(23)కు చింతపల్లి మండలం గొడుగుండ్లకు చెందిన రాజుతో ఈ నెల 19న గొడుగుండ్లలో వివాహం జరిగింది.
అయితే పెళ్లి రోజున కట్నకానుకల విషయం.. ఇరు కుటుంబీకుల మధ్య గొడవకు దారి తీసింది. ఈ గొడవతో కల్పన మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే పెళ్లి జరిగిన రాత్రి గుడిపల్లిలోని ఇంట్లో నెయిల్ పాలిష్ తాగింది. గమనించిన కుటుంబీకులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఆస్పత్రికి తరలించగా శనివారం రాత్రి మృతి చెందింది. నవ వధువు మృతితో సందడిగా ఉండాల్సిన ఇంట్లో విషాదం నిండింది. బంధువుల రోదనలతో గ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషయమై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.