శింగనమల: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండల పరిధిలోని సంజీవపురంలో ఓ రైతు అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం చోటు చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. సంజీవపురం గ్రామానికి చెందిన నాగిరెడ్డి(65) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు సంతానం. అందరికీ పెళ్లిళ్లు చేశారు. నాగిరెడ్డికి 12 ఎకరాల పొలం ఉండగా.. దాదాపు 10 బోర్లు వేయించాడు.
ప్రస్తుతం రెండు బోర్లలో మాత్రమే నీరుంది. సాగు, కూతుళ్ల పెళ్లిళ్లకు రూ.10లక్షల వరకు అప్పు చేశాడు. గ్రామంలో అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం సర్వే చేయగా నాగిరెడ్డికి సంబంధించిన 8 ఎకరాలు అందులో పోతోంది. నాగిరెడ్డి పేరిట 5.50 ఎకరాల భూమి ఉండగా.. మిగిలిన 6.50 ఎకరాలు కుమారులకు పంచిచ్చాడు. నాగిరెడ్డికి అనంతపురం ఏడీబీ బ్యాంక్‌లో రూ.లక్ష క్రాప్ లోను, ఇండియన్ బ్యాంక్‌లో రూ.60 వేలు బంగారుపై రుణం ఉంది. ఇతనికి ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ రూ.19 వేలు వచ్చినట్లు బంధువుల ద్వారా తెలిసింది.
భూమి హైవే రోడ్డుకు పోయిందనే బాధ
నాగిరెడ్డి బ్యాంకులతో పాటు బయటి వ్యక్తుల వద్ద దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశాడు. ఇటీవల ప్రభుత్వం అమరావతి ఎక్స్‌ప్రెస్ రోడ్డు నిర్మాణానికి సర్వే చేపట్టింది. అందులో నాగిరెడ్డి భూమి 12 ఎకరాలలో 8 ఎకరాల వరకు పోతుందని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పారు. ఉన్న భూమి అంతా రోడ్డుకు పోతే.. అప్పులు ఎలా తీర్చాలోనని మదనపడ్డాడు. ఇదే సమయంలో రుణ దాతల నుంచి ఒత్తిళ్లు పెరగడంతో శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మరణించాడు. మృతుడి కుటుంబాన్ని వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలూరి సాంబశివారెడ్డి పరామర్శించారు. నాగిరెడ్డి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Sat, Sep 9 2017 10:36 PM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement