కన్న కూతుళ్లే కాడెద్దులుగా..
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ తండ్రి కన్న కూతుళ్లనే కాడెద్దులుగా మార్చుకున్నాడు. వివరాల్లోకి వెళితే సెహోర్ తాలూకా బసంత్‌పూర్ గ్రామానికి చెందిన సర్దార్ కహ్ల కుటుంబం వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతోంది. వారిది రెక్కాడితే కాని డొక్కారి పరిస్థితి. సర్దార్ కహ్ల తన పొలం దున్నటానికి ఎద్దులు లేవు. వాటిని కొని పోషించే స్తోమత అంతకన్నా లేదు. దీంతో తన ఇద్దురు కూతుళ్లని బడి మానిపించి వారినే పొలం దున్నటానికి ఉపయోగించుకుంటున్నాడు. కేవలం ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కూతుళ్లు రాధిక, కుంతిల చదువుకు అంతరాయం కలిగించానని కహ్ల చెప్పాడు.
దీని గురించి డీఆర్‌డీఓ ఆశిశ్ శర్మ స్పందించి రైతు దుస్థితి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాల కింద వారికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. మీ కూతుళ్లని అలా ఎద్దుల స్థానంలో ఉపయోగించల్సింది కాదని రైతుతో అన్నారు.