భూ దోపిడీ కోసమే ‘మడ’
చిలకలపూడి : విదేశీ పరిశ్రమలకు అప్పగించేందుకు భూదోపిడీ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం ఎంఏడీఏ (మడ)ను ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు గుంటూరు రాఘవులు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విదేశీ కంపెనీలకు రైతుల భూముల్ని కట్టబెట్టడానికే మడను ఏర్పాటు చేశారని దీని కోసం విడుదల చేసిన జీవో నెంబరు 15ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం 766 ఎకరాలకు పోర్టు నిర్మాణాన్ని పరిమితం చేయాలన్నారు. ఎదురుమొండి పంచాయతీ పరిధిలో దశాబ్ధకాలంగా ప్రజలు సాగు చేసుకుంటున్న రెండువేల ఎకరాల రెవెన్యూ భూములను అటవీశాఖ నుంచి ప్రజలకు పట్టాలు జారీ చేయాలని కోరారు. దివిసీమ ప్రాంతంలోని శివారు ప్రాంతాల ప్రజలు సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. గత సంవత్సరం తాగునీరు అందక పొలాలు బీడులుగా మారిపోయాయని, బాధిత రైతులకు ఎకరానికి రూ. 10వేలు నష్టపరిహారం అందించాలన్నారు. పంటకాలువ మరమ్మతుల్లో జాప్యం జరుగుతోందని తక్షణమే పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతుకూలీ సంఘం నాయకులు పీతా రమేష్, లంకే సుబ్బారావు, నడకుదుటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.