అప్పుతీర్చే మార్గం కనిపించక..
శాలిగౌరారం : రెండేళ్ల కిత్రం అనారోగ్యంతో తండ్రి మృతి.. ప్రస్తుతం తల్లి కూడా ఆరోగ్యం బాగాలేక కదలలేని పరిస్థితి.. ఇంట్లో పెళ్లీడుకొచ్చిన చెల్లి.. వీటితో ఒక పక్క కుటుంబ భారం.. మరో పక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు.. వాటిని జయించేందుకు విద్యను మధ్యలోనే మానేసి వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు అక్కెనపల్లి నాగరాజు (27). కానీ సాగు చేసిన పంట చేతికొచ్చే సమయంలో పూర్తిగా దెబ్బతినడంతో దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని ఇటుకులపహాడ్ గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అక్కెనపల్లి నాగరాజు (27)కు గ్రామంలో నాలుగున్నర ఎకరాల వ్యవసాయ మెట్టభూమి ఉంది.
ఉన్న వ్యవసాయ భూమిలో రెండేళ్లుగా పత్తి పంటను సాగు చేస్తూ వస్తున్నాడు. దాంతో నష్టం వచ్చింది. అయినా ఈ ఏడాది కూడా మళ్లీ పత్తిసాగు చేశాడు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు నీరు నిలవడంతో పంట మొత్తం ఎర్రబారింది. దీనికి తోడు తెగులు సోకింది. దీంతో పంట దిగుబడి పూర్తిగా తగ్గింది. తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటికే సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. చేసిన అప్పులు పెరిగిపోవడం, కుటుంబ పోషణ భారం కావడంతో ఆయన కొద్ది రోజులుగా తీవ్ర మనోవేధనకు గురవుతున్నాడు. ఈ క్రమంలో నాగరాజు భార్య ఉమ తమ పిల్లలతో కలిసి దీపావళి పండుగ కోసం తల్లిగారింటికి వెళ్లింది.
ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. అది గమనించిన నాగరాజు చెల్లెలు కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి ద్విచక్ర వాహనంపై నకిరేకల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో 108 వాహనం కలిసింది. దాంట్లో నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ నాగరాజుకు వైద్యులు చికిత్స చేస్తుండగానే మృతిచెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. సోమవారం మృతుడి భార్య ఉమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ చారి తెలిపారు.