సృజన సంపన్నుడు! | intelligent young farmer bommagani mallesh | Sakshi
Sakshi News home page

సృజన సంపన్నుడు!

Published Tue, Aug 4 2015 3:49 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

సృజన సంపన్నుడు! - Sakshi

సృజన సంపన్నుడు!

రైతులకు ఉపకరించే ఆవిష్కరణలతో అబ్బురపరుస్తున్న యువకుడు
పేద రైతు ఇంట పుట్టిన బిడ్డ అయితేనేం... కొత్త బంగారు లోకం కోసం బోలెడు కలలు కంటున్నాడు బొమ్మగాని మల్లేష్. సృజనాత్మక ఆవిష్కరణల ద్వారా చిన్న, సన్నకారు రైతులకెంతో ఉపయోగపడే యంత్ర పరికరాలను వెలువరిస్తున్నాడు. చదువు పదో తరగతితో ఆగిపోయినా.. జ్ఞానార్జన తృష్ణ అతన్ని హోటల్ పనిలో నిలవనీయలేదు. ప్రతి అవరోధాన్నీ అవకాశంగా మార్చుకుంటూ కొత్త కొత్త యంత్ర పరికరాలను ఆవిష్కరిస్తున్నాడు. చిన్నతరహా పరిశ్రమను సైతం నెలకొల్పి ముగ్గురికి ఉపాధి కల్పిస్తూ..

తన ఆవిష్కరణలను రైతులకు అందుబాటులోకి తెస్తున్నాడు. ముప్పయ్యేళ్ల వయసులోనే అనూహ్యమైన విజయాలు సాధించినందుకు గుర్తింపుగా 8 అవార్డులు పొందిన మల్లేష్ ఇటీవల గౌరవ డాక్టరేట్‌ను అందుకోవడం విశేషం.
 
రెక్కాడితే గాని డొక్కాడని చిన్న రైతు కుటుంబంలో బొమ్మగాని వెంకటయ్య(60), దివంగత లక్ష్మి దంపతుల ఏకైక మగ సంతానం మల్లేష్(30). వెంకటయ్య ఎకరం సొంత పొలంలో వరి సాగుచేస్తూ రోజూ ఐదారు తాటి చెట్ల నుంచి కల్లు తీస్తుంటాడు. నల్లగొండ జిల్లా మోత్కూరు మండలం ఆజిమ్‌పేట మల్లేష్ స్వగ్రామం. పొరుగూరు అడ్డగూరు జెడ్పీ హైస్కూలు రోజూ నడిచెళ్లి పదో తరగతి వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా చదువుకు స్వస్తి చెప్పి వరంగల్‌లో హోటల్ కార్మికుడిగా ఏడాది పనిచేశాడు.

ఇంకా ఏదో సాధించాలన్న తృష్ణ అతన్ని ఆ పనిలో నిలవనీయలేదు. భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌లో సోలార్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ డిప్లొమాలో 6 నెలలు శిక్షణ(2002) పొందాడు. ఆ శిక్షణ మల్లేష్‌లోని సృజనాత్మకతకు రెక్కలు తొడిగింది. సరికొత్త ఆవిష్కరణలకు పురికొల్పింది. చిన్న రైతులు కొని ఉపయోగించుకోగలిగిన చిన్న పరికరాలు, యంత్రాలు తయారు చేయడంపైనే తనకు ఆసక్తి ఎక్కువంటున్న మల్లేష్ తన సొంత తెలివితేటలతో ఇప్పటికి 9, 10 కొత్త ఉత్పత్తులు తయారు చేశాడు. బోడుప్పల్ బృందావన్ కాలనీలో ‘బీఎల్ సోలార్ ఇన్నోవేషన్స్’ అనే చిన్న పరిశ్రమను సైతం నెలకొల్పాడు. 8కి పైగా అవార్డులను అందుకున్నాడు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (2013) జాతీయ అవార్డు కూడా వీటిలో ఉంది. ‘యునెటైడ్ థియొలాజికల్ రీసెర్చ్ యూనివర్సిటీ’ గత మేలో మల్లేష్‌కు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం విశేషం.
 
ముఖ్యమైన ఆవిష్కరణలు
పత్తి తీసే చేతి మిషన్ :
మనిషి సులువుగా చేతితో పట్టుకొని పత్తి తీయడానికి ఉపయోగపడే చిన్న యంత్రమిది. కిలోన్నర వరకు బరువుండే ఈ యంత్రం సోలార్ బ్యాటరీతో పనిచేస్తుంది. బ్యాటరీని 6 గంటలు చార్జ్ చేస్తే పది - పన్నెండు గంటలు పనిచేస్తుంది. ఒక మనిషి రోజుకు 120 కిలోల పత్తి తీయొచ్చని మల్లేష్ చెబుతున్నాడు. గత ఖరీఫ్‌లో 30 వరకు ఈ మిషన్లు రైతులకు ఇచ్చానని, అవి చక్కగా పనిచేస్తున్నాయన్నాడు.
 
ఎరువులు చల్లే యంత్రం: పొలంలోని మొక్కలకు కచ్చితమైన మోతాదులో ఎరువులు వేయడానికి వీలుగా ఉండే ఒక యంత్రాన్ని మల్లేష్ రూపొందించాడు. 15 కిలోల బరువుండే దీనిని వీపునకు తగిలించుకొని ఉపయోగించాల్సి ఉంటుంది.
 సోలార్ పవర్ స్ప్రేయర్: సౌరశక్తితో నడిచే పవర్ స్ప్రేయర్‌ను మల్లేష్ రూపొందించాడు. దీనికి 18 లీటర్ల ట్యాంకుంది. 7 గంటలు చార్జింగ్ చేస్తే 7 గంటలపాటు స్ప్రే చేస్తుంది. సోలార్ పేనల్‌ను కూడా ట్యాంకుకు తగిలించుకుంటే.. నేరుగా సౌర విద్యుత్‌ను వినియోగించుకుంటూ స్ప్రే చేయొచ్చు. మరో రూ. వెయ్యి చెల్లిస్తే.. ఇదే బ్యాటరీతో పనిచేసే టేబుల్ ఫ్యాన్, 2 బల్బులు, మొబైల్ చార్జింగ్ కిట్‌ను కూడా ఇస్తున్నాడు.
 
పెడల్ పంపు: కాళ్లతో పెడల్స్‌ను తొక్కుతుంటే కుంట లేదా వాగులు వంకలు, మడుగుల్లోని నీటిని పంటలకు సులభంగా తోడడానికి పెడల్ పంపు ఉపయోగపడుతుంది. ఇందులో ఎటువంటి యంత్రాలూ 30 అడుగుల లోతు నుంచి లేదా నేల మీద ఉన్న నీటిని 20 అడుగుల ఎత్తుకు తోడిపోయగలదు.
 
కలుపు తీసే పరికరం (వీడర్ ):
ఒక ఎకరంలో కలుపు తీతకు రూ. వేలకు వేలు ఖర్చవుతాయి. కానీ, మనిషి రోజుకు 2 ఎకరాల్లో కలుపు తీయడానికి ఉపయోగపడే వీడర్‌ను మల్లేష్ రూపొందించాడు. 8 కిలోల బరువుండే ఈ వీడర్‌ను మహిళలు సైతం ఉపయోగించవచ్చు.
 
చెట్లెక్కేందుకు దోహదపడే పరికరం : తాటి / కొబ్బరి చెట్లు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ ఏటా వందలాది మంది దుర్మరణం పాలవుతున్నారు. తాటి చెట్లు ఎక్కేటప్పుడు పట్టు తప్పి, తన బాబాయిలు ఇద్దరు వికలాంగులయ్యారు. ఈ దుస్థితి మరెవరికీ రాకూడదన్న లక్ష్యంతో మల్లేష్ చెట్లెక్కేందుకు వీలుగా ఉండే ప్రత్యేక పరికరాన్ని రూపొందించాడు. సీటుపైన కూర్చొని సునాయాసంగా చెట్టెక్కడానికి ఉపయోగపడుతుంది. బరువు 5 కిలోలు. భుజాన వేసుకొని తీసుకెళ్లి చెట్లెక్కవచ్చు. 15-20 ఏళ్ల వరకు పనిచేస్తుందని మల్లేష్ తెలిపాడు.
 
ఎస్‌ఎంఎస్ సర్క్యూట్ : పండ్ల తోటల్లో నేలలో తేమ తగ్గిపోయి బెట్ట పరిస్థితి వచ్చినప్పుడు రైతుకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందించే సర్క్యూట్‌ను రూపొందించాడు. చెట్ల దగ్గర భూమిలో అక్కడక్కడా సెన్సార్లు బిగించాడు. పంటకు నీరు కావాలన్న సమాచారం రాగానే మొబైల్ ద్వారానే రైతు మోటార్‌ను ఆన్ చేసుకునే అవకాశం ఉంటుంది.
 
ఇవి కాకుండా... ఫ్యాన్, లైట్ ఆఫ్ - ఆన్ చేసేందుకు ఉపయోగపడే రిమోట్, సోలార్ ట్రైసైకిల్ వంటి అనేక యంత్ర పరికరాలను యువ ఇన్నోవేటర్ మల్లేష్ ఆవిష్కరించాడు.
చిన్న రైతులకు ఉపయోగడే మరో 6-7 ఇన్నోవేషన్లు పరిశోధన దశలో ఉన్నాయన్నాడు. రాష్ట్ర ప్రభుత్వం రూరల్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసి తన పరిశోధనలకు ఆర్థికంగా తోడ్పాటునందిస్తే చిన్న రైతుల అవసరాలు తీర్చే మరికొన్ని యంత్ర పరికరాలను రూపొందించగలనంటున్నాడు. ఆల్ ద బెస్ట్ మల్లేష్!
- పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్
 

వారంలో తయారు చేసిస్తా..
నవంబర్ 14-30 వరకు ప్రతి ఏటా ఢిల్లీలోని ప్రగతిమైదాన్‌లో జరిగే వాణిజ్య ప్రదర్శనలో నాకు ఉచితంగా స్టాల్ ఇస్తున్నారు. అక్కడి అమ్మకాలే నన్ను ఆదుకుంటున్నాయి. హైదరాబాద్‌లో కూడా ఇటువంటి సదుపాయం కల్పిస్తే నా వంటి ఇన్నోవేటర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త ఆవిష్కరణలపై పరిశోధనలు కొనసాగించడానికి గ్రాంటు ఇవ్వటం ద్వారా ప్రభుత్వం ప్రోత్సహించాలి. రైతులకు ఫలానా అవసరానికి పరికరం/యంత్రం కావాలని అడిగితే వారం రోజుల్లో తయారు చేసి ఇవ్వగలను.
- బొమ్మగాని మల్లేష్ (88850 73666), బీఎల్ సోలార్ ఇన్నోవేషన్స్, బృందావన కాలనీ, బోడుప్పల్, హైదరాబాద్
 
సులువుగా విత్తనాలేసే ‘తోరణాల చట్రం’!
సంక్షోభంలో ఉన్న అన్నదాతకు నాలుగు రూపాయలు మిగలాలంటే సాగు వ్యయం, శ్రమ తగ్గాలి. ఇందుకు తగిన దారులు వెతికే పనిలో నిమగ్నమైన ఒకానొక అభ్యుదయ రైతు కొడాలి కృష్ణారావు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరుకు చెందిన ఆయన తేలికపాటి సాగు పద్ధతులపై ప్రయోగాలు చేస్తుంటారు. శ్రీవరి పద్ధతిలో రెండు కేజీల బిపీటీ విత్తనంతో ఎకరానికి 38 బస్తాల దిగుబడి సాధించారు. విత్తనం ఎద బెట్టడానికి డ్రమ్‌సీడర్ కంటే సులువుగా పని పూర్తి చేసేందుకు ఉపకరించే తోరణాల చట్రం అనే పరికరాన్ని ఆయన ఇటీవల తయారు చేయించారు.

అల్యూమినియం ఫ్రేముకు పాలిథిన్ కవర్లతో తోరణాల చట్రం చేయించారు. దమ్ము చేసిన పొలంలో ఈ చట్రంతో ఇద్దరు మనుషులు 9ఁ9 అంగుళాల దూరంలో మొలక గట్టిన విత్తనాన్ని సులువుగా విత్తుకోవచ్చు. విత్తనం పొలమంతా సమంగా పడుతుందన్నారు. 40 సెంట్ల పొలానికి 6 కేజీల విత్తనం వినియోగించానన్నారు. మొక్కకు ఎటు చూసినా 9ఁ9 అంగుళాల దూరం ఉండటం వలన పంటకు గాలి, వెలుతురు చక్కగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. దుబ్బు బాగా చేయటంతోపాటు దిగుబడి బాగుంటుందని కృష్ణారావు (78933 37891) తెలిపారు. ఈ తోరణాల చట్రానికి చక్రాలు అమర్చితే మరింత సులభంగా విత్తుకోవచ్చన్నారు. ప్రయోగాత్మకంగా పాలిథిన్ పరదాపై ముప్పావు సెంటులో నారుమడిని ఏర్పాటు చేసి 15 రోజుల నారును ఎకరంలో నాట్లేయించానని వివరించాడు.
- నాగరాజు, తోట్లవల్లూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement