ఉసురుతీసిన అప్పులు
– పురుగులమందు తాగి రైతు బలవన్మరణం
–కట్టంగూర్ మండలం అయిటిపములలో ఘటన
కలిసిరాని కలాం మరో రైతును బలితీసుకుంది. ఆరుగాలం శ్రమించి, పెట్టుబడులు పెట్టినా వరుణులు కరుణించకపోవడంతో కుదేలయ్యాడు. చేసిన అప్పులు ఓవైపు గుండెలమీద నిప్పులకుంపటిగా మారడంతో తట్టుకోలేకపోయాడు. మరో వైపు పూటగడవని పరిస్థితులకు మనస్తాపం చెంది చావే శరణ్యమనుకుని బలవన్మరణానికి ఒడిగట్టాడు.
– కట్టంగూర్
కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామానికి చెందిన బొబ్బలి సుదర్శన్(40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తనకున్న మూడు ఎకరాలతో పాటు మరో మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని మూడేళ్లుగా సాగుచేస్తున్నాడు. రెండు సంవత్సరాలుగా తీవ్రవర్షాభావంతో సాగు చేసిన పత్తిచేను ఎండిపోయింది. కుటుంబ అవసరాలు, వ్యవసాయ పెట్టుబడులకు సుమారుగా రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఆరెకరాల్లో వేరుశనగ, కంది, వరిపంటలు సాగుచేశాడు. నెల రోజులుగా వర్షాలు లేక పంటలు కళ్లముందే వాడుబారిపోతున్నాయి. ఈనేపథ్యంలో చేసిన అప్పులు ఏలా తీరుతాయనే మనస్తాపంతో గురువారం ఉదయం పత్తిపంట చేనువద్దకు వెళ్లి పురుగులమందు తాగాడు. గమించిన కుటుంబ సభ్యులు కొన ఊపిరితో ఉన్న సుదర్శన్‌ను నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య సైదమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.