
ధరలపై మిర్చి రైతుల ఆక్రోశం
► మంత్రి పుల్లారావుకు సమస్యల ఏకరువు
► ఆత్మహత్యలు తప్పవని హెచ్చరిక
► ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వినతి
కొరిటెపాడు(గుంటూరు): రోజురోజుకు పతనమవుతున్న మిర్చి ధరలపై రైతులు మంత్రి ఎదుట ఆక్రోశం వెలిబుచ్చారు. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. మిర్చి కొనుగోళ్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ఏఏ రకం మిర్చికి ఎంత ధర లభిస్తోంది? ఎకరాకు ఎన్ని క్వింటాళ్ల దిగుబడి వస్తోందని రైతులను అడిగి తెలుసుకొన్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మిర్చి ధరలు రోజు రోజుకు పతనం అవుతున్నాయని, ఎకారకు రూ.1.50 లక్షలు ఖర్చు అవుతోందని, దిగుబడి మాత్రం 15 నుంచి 18 క్వింటాళ్లకు మించి రావటం లేదని తెలిపారు. గత ఏడాది క్వింటా రూ.15 వేల ధర పలికిన మిర్చికి, ఈ ఏడాది రూ.7వేలకు మించి రావటం లేదని, ఇవే ధరలు కొనసాగితే రైతుల ఆత్మహత్యలు తప్పవంటూ సమస్యలను ఏకరువు పెట్టారు. మార్క్‌ఫెడ్‌ను రంగంలోకి దించి రాష్ట్ర ప్రభుత్వమే మిర్చిని కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సాగు విస్తీర్ణం పెరగడమే కారణం : ప్రత్తిపాటి
అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి పుల్లారావు మాట్లాడుతూ ఇప్పటికే ధరలు పతనం కావటానికి మిర్చి సాగు విస్తీర్ణం పెరగడమే కారణమన్నారు. గత ఏడాది కన్నా రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు విస్తీర్ణం పెరిగిందని తెలిపారు. మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చి కొనుగోలు చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగావుందని చెప్పారు.
ఇప్పటికే ఇద్దరు, ముగ్గురు ఎక్స్‌పోర్టర్స్ శాంపిల్స్ తీసుకెళ్లారని, వారి నుంచి ఆర్డర్స్ రాగానే మార్క్‌ఫెడ్ ద్వారా మిర్చిని కొనుగోలు చేసి రైతులకు మెరుగైన ధర చెల్లించేలా చూస్తామని హామీ ఇచ్చారు. దీనిపై మూడు, నాలుగు రోజుల్లో ఒక స్పష్టత వస్తుదన్నారు. యార్డు చైర్మన్ మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న ధరలు పడిపోకుండా చూస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ పి.మల్లికార్జునరావు, జీడీసీసీ బ్యాంక్ చైర్మన్ ముమ్మనేని వెంకటసుబ్బయ్య, యార్డు వైస్ చైర్మన్ కొత్తూరి వెంకట్, యార్డు కార్యదర్శి దివాకర్ తదితరులు పాల్గొన్నారు.