
పేటను పెద్ద నగరంగా మారుస్తాం
నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంత వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.
♦ నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంతోత్సవాల్లో సీఎం ప్రకటన
♦ ఘనంగా ప్రారంభమైన మున్సిపాలిటీ వందేళ్ల వేడుకలు
♦ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన సీఎం
♦ సత్తెనపల్లి మీదుగా అమరావతికి ఔటర్ రింగ్‌రోడ్ అని ప్రకటన
సాక్షి, గుంటూరు : నరసరావుపేట మున్సిపాలిటీ శత వసంత వేడుకలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజులు జరిగే ఈ వేడుకలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని స్టేడియంలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ రాజధాని అమరావతి తరువాత దగ్గరలో ఉండే అతి పెద్ద సిటీగా నరసరావుపేటను అభివృద్ధి చేస్తామని చెప్పారు. వందేళ్లు పూర్తయిన సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తూ సభాపతి డాక్టర్ కోడెల నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారని కొనియాడారు.
నరసరావుపేటలో ఉన్న 100 పడకల ఆసుపత్రిని రూ.100 కోట్లతో 300 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్లు వేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. సత్తెనపల్లిని ఆనుకొని అమరావతికి 220 కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు చెప్పారు. సమైక్య రాష్ట్రానికి, నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి స్పీకర్‌లుగా నరసరావుపేటకు చెందిన వ్యక్తులు కావడం విశేషమన్నారు. నరసరావుపేటకు చెందిన కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి సుదీర్ఘంగా రాజకీయాలను నడిపారన్నారు. నరసరావుపేటలో జేఎన్టీయూ కాకినాడ తరఫున మరో బ్రాంచిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమానికి ప్రత్యేక అతిథులుగా హాజరైన అపోలో హాస్పిటల్స్ అధినేత ప్రతాప్ సి రెడ్డి, జి.ఎం.ఆర్ గ్రూప్స్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు, భారత్ బయోటెక్ జేఎండీ సుచిత్ర ఎల్లా, సినీ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావులను ముఖ్యమంత్రి చంద్రబాబు సత్కరించారు. శతాబ్ది వేడుకల సందర్భంగా తపాలాశాఖ తయారు చేసిన ప్రత్యేక కవర్‌ను సీఎం చేతులమీదుగా ఆవిష్కరించారు.
ప్రజల పాత్ర అభినందనీయం: కోడెల
స్పీకర్ డాక్టర్ కోడెల మాట్లాడుతూ, పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రజలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. నరసరావుపేట నియోజకవర్గంలో 11,500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. మున్సిపాలిటీ శత వసంతాల పండుగను ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ముందుగా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెలిప్యాడ్ వద్ద సీఎంను కలసి నియోజకవర్గ సమస్యలపై వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, కామినేని శ్రీనివాస్, ఎంపీ రాయపాటి సాంబశివరావు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, ఐజీ సంజయ్, రూరల్ ఎస్పీ నారాయణనాయక్, జేసీ శ్రీధర్, నరసరావుపేట మున్సిపల్ ైచైర్మన్ నాగసరపు సుబ్బరాయగుప్తా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సినీనటి శోభన నృత్య కార్యక్రమం, హాస్యనటుడు శివారెడ్డి మిమిక్రీ ఆకట్టుకున్నాయి.
కరువు, వరదలు కలిపి కొట్టాయ్
ఏపీని కేంద్రమే ఆదుకోవాలి: చంద్రబాబు
సాక్షి, విజయవాడ బ్యూరో :రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీని ఈ ఏడాది అటు కరువులు ఇటు వరదలు కలసి దెబ్బతీశాయని, వీటి ప్రభావంతో రూ. వేల కోట్ల నష్టానికి గురైన ఏపీని కేంద్ర ప్రభుత్వమే ఉదారంగా ఆదుకోవాలని సీఎం చంద్రబాబు కేంద్ర అధ్యయన బృందాలను కోరా రు. కరువు పరిస్థితుల అధ్యయనానికి రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం.. తమ పర్యటన ముగిసిన నేపథ్యంలో క్యాంప్ ఆఫీసులో శుక్రవారం సీఎంను కలిసింది. వరదనష్టం పై అంచనాల కోసం వచ్చిన కేంద్ర బృందం కూడా శుక్రవారమే సీఎంతో భేటీ అయ్యిం ది. రాష్ట్రంలోని దుర్భిక్ష పరిస్థితులను నివారించడానికి రూ.2,000.56 కోట్లు అవసరమని బాబు కేంద్ర కరువు అధ్యయన బృందానికితెలిపారు. అలాగే అతివృష్టి ఫలి తంగా సంభవించిన వరదల వల్ల వివిధ రంగాలకు రూ.3,759.97 కోట్ల నష్టం వాటిల్లిందని వరద నష్టంపై అంచనాలకు వచ్చిన కేంద్ర బృందానికి సీఎం వివరించారు.