అంతర పంటలపై రైతుల ఆసక్తి
పెద్దేముల్: మండలంలో రైతులు అంతర పంటలపై ఆసక్తి చుపుతున్నారు. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండకపోవడంతో ఈ ఏడాది రైతన్నలు అంతర పంటలు అధికంగా సాగు చేశారు. మండలంలోని మారేపల్లి, నాగులపల్లి, తట్టెపల్లి, నర్సాపూర్, కోటపల్లి, అడ్కిచెర్ల తదితర గ్రామాల రైతులు కందిలో పెసర, మినుములో కంది పంటలు వేసి పంటలు సాగు చేశారు. అంతర పంటలు సాగు చేయటంతో ఓ పంట పాడైనా మరో పంట ఆదుకుంటుందని రైతులు అంటున్నారు. గతేడాది రైతన్నలు అధికంగా పత్తిపంట సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పప్పుదినుసుల పంటలు అధికంగా సాగు చేశారు. సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా కంది, పెసర, మినుము తదితర పప్పుదినుసుల పంటలను సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు.