Inter-crops
-
వరిలో ఊద సాగుతో తగ్గిన కలుపు!
ఘన జీవామృతం, జీవామృతంతో సాగవుతున్న వరి పొలంలో తీవ్రరూపం దాల్చిన కలుపు సమస్యకు వరిలో అంతరపంటగా ఊదల సాగు చేపట్టి పరిష్కరించుకోవచ్చని కర్ణాటకలోని రాయచూర్‌లో కొందరు తెలుగు రైతుల బృందం అనుభవపూర్వకంగా చెబుతున్నారు. స్నేహితులైన రమేశ్, రామలింగరాజు, వెంకట్రాజుల బృందం గత ఏడేళ్లుగా రాయచూర్ దగ్గర్లో రసాయనిక వ్యవసాయ పద్ధతుల్లో వరి, చెరకు సాగు చేస్తున్నారు. కృష్ణా నది నుంచి తోడిన నీటిని పారగట్టి నీటి నిల్వ పద్ధతిలో వరిని సాగు చేస్తున్నారు. చౌడు సమస్య వల్ల ఊడ్చిన వరి నారులో 20% మొక్కలు చనిపోయేవి. రెండు,మూడు సార్లు నాట్లు వేయాల్సి వచ్చేది. వరి పొట్ట దశలో వరి గిడసబారిపోయేది, తాలు ఎకరానికి 10 బస్తాలు వచ్చేది. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయదారుడు సుబ్రహ్మణ్యం రాజు మార్గదర్శకత్వంలో చౌడు భూముల్లో రెండేళ్లుగా సేంద్రియ పద్ధతుల్లో వరి, వరిలో అంతరపంటగా ఊదలు సాగు చేస్తూ సత్ఫలితాలు సాధిస్తున్నారు. చెరకు సాగులోనూ సేంద్రియ పద్ధతులతో చౌడును జయించారు. జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ(ఎన్.ఐ.పి.హెచ్.ఎం.) ద్వారా శిక్షణ పొందిన ఈ రైతుల బృందం తమ వ్యవసాయ క్షేత్రంలోనే 10 రకాల బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలను పెద్ద డ్రమ్ముల్లో అభివృద్ధి చేసి ప్రతి వారం ఎకరానికి 500 లీటర్ల చొప్పున వదలటం వల్ల చౌడు సమస్య 80% తగ్గింది. ఘనజీవామృతం, జీవామృతం, వేస్ట్ డీ కంపోజర్‌ను, బ్యాక్టీరియాలను వేర్వేరు ప్లాట్లలో 30 ఎకరాల్లో మొదటిగా ఈ ఏడాది జనవరి–మార్చి వరకు వాడి చూడగా.. మొదటి ప్రయత్నంలోనే ఎటువంటి సమస్యా లేకుండా పంట దిగుబడి వచ్చింది. అయితే, రైతులు సొంతంగా తయారు చేసుకున్న బ్యాక్టీరియాలు, శిలీంధ్రాలు వాడిన వరి పొలంలో మొక్కలు వేగంగా పెరిగి ఉత్తమ ఫలితాలు వచ్చినట్లు గమనించారు. దీంతో ఈ ఖరీఫ్‌లో సేంద్రియ వరి సాగును 120 ఎకరాలకు విస్తరింపజేశారు. నాటిన మొక్కలు చనిపోలేదు. వరిలో ఊద.. కలుపు నియంత్రణ సేంద్రియ వ్యవసాయం చేపట్టక ముందు కలుపు నిర్మూలనకు ఎకరానికి రూ. 3 వేలతో రసాయనిక కలుపు మందులు చల్లేవారు. సేంద్రియ పద్ధతుల్లో వరి సాగు చేపట్టిన తర్వాత ఎకరానికి రూ. 3 వేల నుంచి రూ. 9 వేల వరకు కలుపుతీతకు ఖర్చవుతున్నది. ఈ ఖర్చును తగ్గించుకోవడానికి సుబ్రహ్మణ్యం రాజుకు కొత్త ఆలోచన వచ్చింది. వరిలో ఊదను అంతరపంటగా సాగు చేస్తే మేలని తలచి ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేశారు. ఘనజీవామృతం ఎకరానికి టన్ను వేశారు. తర్వాత 4 దఫాల్లో ఎకరానికి 900 కిలోలు వెదజల్లారు. పదిహేను రోజులకోసారి జీవామృతం నీటి ద్వారా ఇస్తున్నారు. 15 రోజులకోసారి జీవామృతాన్ని పిచికారీ చేస్తున్నారు. సొంతంగా అభివృద్ధి చేసుకున్న బ్యాక్టీరియాలను, శిలీంధ్రాలను నీటి ద్వారా అందిస్తున్నారు. వరి నాట్లు వేసిన రోజే ఎకరానికి 3 కిలోల ఊద విత్తనం వెదజల్లారు. వరి,ఊద మొక్కలతో పొలం వత్తుగా పెరగడంతో కలుపు సమస్య తగ్గింది. ఒకేసారి కలుపు తీయించారు. ఎకరానికి రూ. 2,500 అయ్యింది. 75 రోజులకు ఊద కోతకు వచ్చింది. 3 క్వింటాళ్ల ఊద ధాన్యం దిగుబడి రావాల్సింది, పక్షులు తినటం వల్ల 180 కిలోలు వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ సేంద్రియ వరి కంకి బాగుంది. వరి దిగుబడిపై పెద్ద ప్రభావం ఉండకపోవచ్చని రమేశ్(94811 12345) తెలిపారు. తొలి ఏడాది ఏకపంటగా సేంద్రియ వరిలో 17 బస్తాల దిగుబడి వచ్చింది. అంతరపంటగా ఊద వేసినప్పటికీ వరి దిగుబడి 20 బస్తాలకు తగ్గకుండా వస్తుందని భావిస్తున్నామన్నారు. సేంద్రియ వరిలో ఊద సాగు వల్ల కలుపు సమస్య తగ్గిపోవడమే కాకుండా.. ఆదాయమూ వస్తుందని సుబ్రహ్మణ్యం(76598 55588) తెలిపారు. బ్యాక్టీరియా డ్రమ్ములను పరిశీలిస్తున్న సుబ్రహ్మణ్యం రాజు -
అంతర పంటలపై రైతుల ఆసక్తి
పెద్దేముల్: మండలంలో రైతులు అంతర పంటలపై ఆసక్తి చుపుతున్నారు. రెండేళ్ల నుంచి వర్షాలు లేక పంటలు పండకపోవడంతో ఈ ఏడాది రైతన్నలు అంతర పంటలు అధికంగా సాగు చేశారు. మండలంలోని మారేపల్లి, నాగులపల్లి, తట్టెపల్లి, నర్సాపూర్, కోటపల్లి, అడ్కిచెర్ల తదితర గ్రామాల రైతులు కందిలో పెసర, మినుములో కంది పంటలు వేసి పంటలు సాగు చేశారు. అంతర పంటలు సాగు చేయటంతో ఓ పంట పాడైనా మరో పంట ఆదుకుంటుందని రైతులు అంటున్నారు. గతేడాది రైతన్నలు అధికంగా పత్తిపంట సాగు చేసేవారు. కానీ ఈ ఏడాది పప్పుదినుసుల పంటలు అధికంగా సాగు చేశారు. సుమారు ఐదు వేల ఎకరాలకు పైగా కంది, పెసర, మినుము తదితర పప్పుదినుసుల పంటలను సాగు చేశారని వ్యవసాయ అధికారులు తెలిపారు. -
అంతర పంట లాభదాయకం
వలేటివారిపాలెం : సపోట, మామి డి, జామ పండ్ల తోటల్లో కూరగాయలు, మినుమును అంతర పంటలుగా సాగు చేస్తూ రైతులు లాభాలు గడిస్తున్నారు. ప్రస్తుతం వలేటివారిపాలెం మండలంలో పలువురు రైతులు మినుము, దొండ, బెండ, కాకర, దోస, చిక్కుడు, వంగ, గోంగూర, తోటకూర, పాలకూరను రైతులు అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. పండ్ల తోటల్లో అంతర పంటలు సాగు చేసినా, చేయకపోయినా దుక్కి, కలుపు నివారణ చర్యలు చేపట్టాలి. ఇందుకుగాను ఏడాదికి రూ.7 వేలు ఖర్చు చేయాలి. అంతర పంటలు సాగు చేసినా అదే ఖర్చు అవుతుంది. పండ్ల తోటలో కూరగాయలు, మినుము పంట లను సాగు చేస్తే వాటికి వాడే మందులు పండ్ల తోటలకు కూడా ఉపయోగపడతాయి. పండ్ల తోటల్లో సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సిన పని ఉండదు. పైగా పండ్ల మొక్కలు త్వరితగతిన పెరగడానికి అవకాశం ఉంటుంది. కూరగాయల సాగుకు మూడు నెలలు శ్రమిస్తే ఆ తర్వాత మూడు నెలలపాటు పంటను కోసి విక్రయించుకోవచ్చు. పండ్ల తోటల్లో అంతర పంటలను ఆరేళ్లపాటు సాగు చేసుకోవచ్చు. పండ్ల మొక్కలు ఎదిగిన త ర్వాత అంతర పంటలు సాగు చేయడం అంత శ్రేయస్కరం కాదు. -
అంతర పంటలపై అమితాసక్తి
పెద్దేముల్: అంతర పంటలు వేయటంతో ఏదైనా ఓ పంట చేతికి వస్తుందని... వరుణుడు అనుకూలిస్తే రెండు పంటలూ చేతికి వస్తాయనే నమ్మకంతో రైతులు మండలంలో అంతర పంటసాగుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని పెద్దేముల్ ఏఓ వెంకటేశం తెలిపారు. మండలంలోని పాషాపూర్, సిద్దన్నమడుగు తండా, ఓగ్లాపూర్, మారేపల్లి, ఇందూరు, నాగులపల్లి, నర్సపూర్, తట్టెపల్లి, రుద్రారం, మంబాపూర్ తదితర గ్రామాల్లో రైతులు ఖరీఫ్ విత్తనాలు నాటుకునే సమయంలో కంది పంటలతో పాటు, మెక్కజొన్న, కంది- మినుము, కంది- పెసర, కంది- తెల్లజొన్న పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఆయా పంటల్లో ఏ ఒక్క పంటయినా దక్కుతుందన్న నమ్మకంతో రైతులు సాగు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది మినుము, పెసర పంటలు రైతులకు అనుకూలించలేదు. కొన్ని గ్రామాల్లో తెల్లజొన్న పంటలు అనుకూలించాయి. ప్రస్తుతం కంది పంటలు మాత్రం బాగా ఉన్నాయని రైతులు అంటున్నారు. అన్ని పంటల కంటే రైతులు ఈ ఏడాది కంది, పత్తి పంటలను సుమారు 8 వేల ఎకరాల్లో సాగు చేశారు. -
కందిలో అంతర పంటలుగా పప్పు ధాన్యాల సాగు మేలు
పెసర ఎల్బీజీ-407, 457, 450, 410 రకాలు ప్రస్తుతం సాగు చేసుకోవడానికి అనుకూలం. మొక్కలు నిటారుగా పెరిగి మొక్క పై భాగాన కాయలు కాస్తాయి. ఇవి పల్లాకు, వేరుకుళ్లు, ఎల్లో మొజాయిక్ తెగుళ్లను తట్టుకుంటాయి. వరి మాగాణుల్లో అయితే నీటి తడి అవసరం లేదు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు 1, 2 నీటి తడులు ఇస్తే మంచి దిగుబడి వస్తుంది. పెసర, అలసంద, మినుమును రబీ కందిలో అంతర పంటగా వేసుకోవచ్చు. అంతర పంటగా సాగు చేసేటప్పుడు ఎకరాకు 5 కిలోల విత్తనం, 6 కిలోల నత్రజని, 15 కిలోల భాస్వరం వేసుకోవాలి. అలసంద స్థానికంగా దొరికే విత్తనాలను రైతులు సాగు చేసుకోవచ్చు. కిలో విత్తనానికి 3 గ్రా. ఎం-45 మందుతో కలిపి శుద్ధి చేస్తే తెగుళ్ల బారి నుంచి పంటను రక్షించవచ్చు. చివరి దుక్కిలో 50 కిలోల డీఏపీ వేసుకోవాలి. మినుము ఎల్బీజీ-752, ఎల్బీజీ-20, 623 రకాలను సాగు చేసుకోవచ్చు. 70-80 రోజుల్లో పంట చేతికొస్తుంది. సస్యరక్షణ చర్యలు పాటిస్తే ఎకరాకు 6-7 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. 752, 20 విత్తన రకాలు పల్లాకు తెగులును తట్టుకుంటాయి. ఎల్బీజీ-623 రకం బూడిద తెగులును తట్టుకుంటుంది. గింజలు లావుగా ఉంటాయి. ఈ విత్తనాలను నాటుకోవచ్చు, వెదజల్లుకోవచ్చు. ఎల్బీజీ-645 రకం ఎండు తెగులును తట్టుకుంటుంది. కాయలు పొడవుగా ఉంటాయి. కిలో విత్తనానికి 30 గ్రా. కార్బోసల్ఫాన్ మందును కలిపి విత్తనాలను శుద్ధి చేస్తే రసం పీల్చే పురుగుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. ఆముదం స్థానికంగా దొరికే రకాలతో పాటు క్రాంతి, హరిత, జ్యోతి, కిరణ్, జ్వాలా హైబ్రిడ్ రకాలైన జీసీహెచ్-4, డీసీహెచ్-177, 519 రకాలను సాగు చేసుకోవచ్చు. క్రాంతి రకం త్వరగా కోతకు వస్తుంది. బెట్టను తట్టుకుంటుంది. గింజ పెద్దదిగా ఉంటుంది. హరిత, జ్యోతి రకాలు ఎండు తెగులును తట్టుకుంటాయి. విత్తిన 7-10 రోజుల్లో మొలక వస్తుంది. 15-20 రోజుల తర్వాత కనుపునకు ఒకే మొక్క ఉండేలా.. చుట్టూ ఉన్న మొక్కలను పీకేయాలి. ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు దుక్కిలో వేసి కలియదున్నాలి. వివిధ రకాలు సాగు చేసేటప్పుడు 12 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువులను విత్తేటప్పుడు వేసుకోవాలి. విత్తిన 30-35 రోజులకు 6 కిలోల నత్రజనిని పైపాటుగా వేసుకోవాలి.