రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుకు గాయాలు
బత్తలపల్లి : బత్తలపల్లి సమీపంలోని పెట్రోలు బంకు వద్ద బుధవారం వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఆటో, బైక్‌ను ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మవరానికి చెందిన తండ్రి, కుమారుడు గాయపడ్డ వారిలో ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు...తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన నరసింహులు తన ఆటోలో ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లికి బియ్యం, సిమెంట్ పెళ్లను తీసుకొని బయలుదేరాడు. అదే సమయంలో అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు వెళ్తున్న బొలేరో వాహనం వేగంగా వచ్చి ఆటోను వెనుక వైపున ఢీకొంది.
ఆ తరువాత కదిరి నుంచి ధర్మవరానికి వెళ్తున్న బైక్‌నూ ఢీకొంది. ఆటో డ్రైవర్ నరసింహులు, ప్రయాణికుడు నాగప్ప సహా బైక్‌లో వెళ్తున్న తండ్రీకొడుకులు అల్లాబకష్, దావూద్ తీవ్రంగా గాపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108లో ఆర్డీటి ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన బొలేరోను డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయినట్లు సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.