bathalapalli
-
Bathalapalli: ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది
సాక్షి, బత్తలపల్లి (సత్యసాయి జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన భార్య... ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. గత నెల 28న అప్పరాచెరువు గ్రామానికి చెందిన బ్యాళ్ల రామకృష్ణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను బత్తలపల్లి పోలీసు స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్ఐ శ్రీహర్షతో కలిసి సీఐ మన్సూరుద్దీన్ వెల్లడించారు. జ్వాలాపురానికి చెందిన డిష్ శివతో 15 సంవత్సరాలుగా రామకృష్ణ భార్య త్రివేణి వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం పసిగట్టిన రామకృష్ణ తరచూ శివతో గొడవపడేవాడు. దీంతో ఎలాగైనా రామకృష్ణ అడ్డు తొలగించుకోవాలని త్రివేణి, శివ భావించారు. రామకృష్ణ పెద్ద కుమార్తె మతాంతర వివాహం చేసుకుని భర్తతో కలిసి వేరే గ్రామంలో స్థిరపడింది. ఈ క్రమంలోనే రామకృష్ణ తనకున్న 4 ఎకరాల భూమిని అమ్మగా వచ్చిన డబ్బుతో రూ.20 లక్షలు వెచ్చించి నూతన గృహ నిర్మాణం చేశాడు. మిగిలిన డబ్బుతో బత్తలపల్లిలో స్థలం కొనుగోలు చేశాడు. ఇటీవల కుటుంబసభ్యులు రామకృష్ణతో గొడవపడి చేయి విరగొట్టారు. అనంతరం చిన్న కుమార్తెను పిలుచుకుని పెద్ద కుమార్తె ఇంటికి త్రివేణి వెళ్లింది. చదవండి: (గదిలోకి దూరి లైంగిక దాడికి యత్నం.. యువతిని కాపాడిన హిజ్రాలు) ఇదే అనువైన సమయంగా భావించిన త్రివేణి, శివ.. రామకృష్ణ హత్యకు పథకం రచించారు. అనంతపురంలో ఆటో నడుపుకుంటున్న తన మిత్రుడు రామాంజనేయులు అలియాస్ రాముతో శివ చర్చించాడు. జూన్ 28న రాము అనంతపురం నుంచి వస్తూ తోడుగా మరో వ్యక్తిని పిలుచుకువచ్చాడు. ఇద్దరూ కలిసి బత్తలపల్లిలో మద్యం సేవించారు. అనంతరం శివతో కలిసి మద్యం బాటిళ్లు తీసుకుని ఆటోలో వేల్పుమడుగు రోడ్డుకు చేరుకున్నారు. అక్కడ మద్యం సేవించి రాత్రి 9 గంటలకు రామకృష్ణకు శివ ఫోన్ చేసి బత్తలపల్లికి రావాలని, త్వరలో తాను బెంగళూరుకు వెళ్లిపోతానని, చివరిసారిగా కలిసి మందు పార్టీ చేసుకుందామని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి అక్కడకు చేరుకున్న రామకృష్ణకు ఫుల్‌గా మద్యం తాపించారు. మత్తులో పడిపోయిన రామకృష్ణ తలపై శివ, రాము బండరాళ్లతో మోది హత్య చేశారు. అనంతరం ఆటోలో అనంతపురం వెళుతూ మార్గమధ్యంలో సంజీవపురంలో పెద్ద కుమార్తె వద్ద రామకృష్ణ భార్య త్రివేణిని కలిసి విషయాన్ని వివరించారు. త్రివేణి ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం వెలుగుచూసింది. దీంతో త్రివేణి, శివ, రాముని సోమవారం అరెస్ట్ చేశారు. నిందితులపై కేసు నమోదు చేసి, మంగళవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ వెల్లడించారు. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. -
ఆటోను ఢీకొట్టిన లారీ, ముగ్గురి దుర్మరణం
సాక్షి, అనంతపురం: జిల్లాలోని బత్తలపల్లి మండల కేంద్రం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బత్తలపల్లి ఇందిరమ్మ కాలనీవద్ద ఆదివారం ఉదయం ఈ దుర్ఘటన సంభవించింది. తాడిమర్రి మండలం పిన్నదరికి చెందిన వీరంతా బొప్పాయి పళ్లను మార్కెట్లో అమ్మేందుకు ఆటోలో బత్తలపల్లికి వస్తుండగా ప్రమాదం జరిగింది. మృతుల్లో సూరి, ఆదమ్మ దంపతులు, చెన్నకేశవ అనే వ్యక్తి ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యాడు. గాయపడ్డవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. (చదవండి: కనిపెంచిన తల్లిని అడవిలో వదిలేశారు) -
మాయలేడి
– జాతకం చెబుతానంటూ ఇంట్లోకొచ్చి బంగారు ఆభరణాల అపహరణ బత్తలపల్లి : జాతకం చెబుతానంటూ ఓ మాయలేడి అమాయకురాలిని బురిడీ కొట్టించింది. ఐదు తులాల బంగారు, ఐదు తులాల వెండి ఆభరణాలను అపహరించి ఉడాయించింది. బాధితురాలు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. వివరాల్లోకెళితే.. బత్తలపల్లికి చెందిన గౌసియా మంగళవారం మధ్యాహ్నం ఇంటి ముందు దుస్తులు ఉతుకుతోంది. ఇదే సమయంలో ఒక గుర్తు తెలియని మహిళ వచ్చి ‘మీ ఇంటి వాస్తు బాగలేదు. మీకు ఏదీ కలిసి రావడం లేదం’టూ మాటలు కలిపింది. దీంతో గౌసియా తన సమస్యలు ఏకరువుపెట్టింది. బయటెందుకు ఇంటిలోకి వెళ్దామంటూ గుర్తు తెలియని మహిళ అనడంతో సరేనని లోనికి తీసుకెళ్లింది. బియ్యం పోసి.. పూజలు చేయాలంటూ సెలవిచ్చింది. దీంతో బియ్యం పోయడానికి చిన్న పాత్రలు లేవనడంతో తనవద్దనున్న పాత్రలను ఇచ్చింది. అందులో బియ్యం పోయగా బంగారు, వెండి నగలుంటే ఇవ్వండి వాటికి కూడా పూజలు చేస్తానని నమ్మబలికింది. దీంతో గౌసియా బీరువాలోనుంచి ఐదు తులాలు (నెక్లెస్, మాటీలు, జుంకీలు, కమ్మలు), ఐదు తులాల వెండి ఆభరణాలు ఇచ్చింది. అనంతరం దక్షణగా రూ.2,100 పెట్టమంది. అన్నిటినీ సమకూర్చిన అనంతరం గౌసియాపై బియ్యం చల్లి.. తాను వెళ్లిన అనంతరం వాటిని సర్దుకోవాలని సూచించింది. తనను కొంత దూరం సాగనంపాలనడంతో ఆమెతో కలిసి గౌసియా కూడా కొంత దూరం వరకు వెళ్లి తిరిగి వెనక్కు వచ్చింది. ఇంట్లో బంగారు, వెండి వస్తువులు కనిపించకపోయేసరికి స్థానికులకు తెలిపింది. వారు వచ్చి చూడగా అప్పటికే గుర్తు తెలియని మహిళ ఎక్కడా కనిపంచలేదు. వెంటనే బాధితురాలు పోలీసులకు సమాచారం ఇచ్చింది. సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో ఆమెను గుర్తు పట్టారు. అయితే ఆమె ఎవరు? ఎక్కడ నుంచి వచ్చారు అన్న వివరాలను ఆరా తీస్తున్నారు. విద్యార్థి మెడలో బంగారు గొలుసు చోరీ మండల కేంద్రం బత్తలపల్లిలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థి దామోదర్ బ్యాంకులో తాకట్టు పెట్టిన ఒకటిన్నర తులం బంగారు చైనును విడిపించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్ కూడలికి చేరుకున్నాడు. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ ఆర్డినరీ బస్సు రాగానే బస్సు ఎక్కాడు. ఇంతలో మెడలో చైను కనిపించలేదు. దీంతో పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశాడు. రెండు కేసులూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉష్ణోగ్రతలు తగ్గుముఖం
అనంతపురం అగ్రికల్చర్ : ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. బత్తలపల్లి మండలంలో శుక్రవారం అత్యధికంగా 36.4 డిగ్రీలు నమోదు కాగా చెన్నేకొత్తపల్లి 36.2 డిగ్రీలు, శింగనమల 35.3 డిగ్రీలు, అనంతపురం 35.3 డిగ్రీలు, పుట్లూరు, తాడిమర్రి, గార్లదిన్నె 35.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా మండలాల్లో 33 నుంచి 35 డిగ్రీలు గరిష్టంగానూ, 24 నుంచి 26 డిగ్రీలు కనిష్టంగా నమోదయ్యాయి. గాలిలో తేమశాతం ఉదయం 72 నుంచి 92, మధ్యాహ్నం 48 నుంచి 58 శాతం మధ్య రికార్డయ్యింది. గంటకు 8 నుంచి 16 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆకాశం మేఘావృతమై గుంతకల్లు, గుత్తి, బొమ్మనహాల్, కూడేరు తదితర 10 మండలాల్లో తుంపర్లు పడ్డాయి. -
రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకుకు గాయాలు
బత్తలపల్లి : బత్తలపల్లి సమీపంలోని పెట్రోలు బంకు వద్ద బుధవారం వేగంగా వచ్చిన బొలేరో వాహనం ఆటో, బైక్‌ను ఢీకొనడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మవరానికి చెందిన తండ్రి, కుమారుడు గాయపడ్డ వారిలో ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు...తాడిమర్రి మండలం నార్శింపల్లికి చెందిన నరసింహులు తన ఆటోలో ముదిగుబ్బ మండలం కొడవండ్లపల్లికి బియ్యం, సిమెంట్ పెళ్లను తీసుకొని బయలుదేరాడు. అదే సమయంలో అనంతపురం వైపు నుంచి కదిరి వైపునకు వెళ్తున్న బొలేరో వాహనం వేగంగా వచ్చి ఆటోను వెనుక వైపున ఢీకొంది. ఆ తరువాత కదిరి నుంచి ధర్మవరానికి వెళ్తున్న బైక్‌నూ ఢీకొంది. ఆటో డ్రైవర్ నరసింహులు, ప్రయాణికుడు నాగప్ప సహా బైక్‌లో వెళ్తున్న తండ్రీకొడుకులు అల్లాబకష్, దావూద్ తీవ్రంగా గాపడ్డారు. వారిని స్థానికులు వెంటనే 108లో ఆర్డీటి ఆస్పత్రికి తరలించారు. తండ్రీకొడుకులను మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. అయితే ప్రమాదానికి కారణమైన బొలేరోను డ్రైవర్ ఆపకుండా వేగంగా వెళ్లిపోయినట్లు సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎం ఏమార్చి.. రూ.30వేలు కాజేసి..!
బత్తలపల్లి : ఓ అమాయకుడిని ఏమార్చి అతడి ఏటీఎంను అపహరించి, ఆ తర్వాత దానితో రూ.30వేలు డ్రా చేసుకున్న ఘనుడి ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ నెల ఎనిమిదో తేదీన నార్పల మండలం గుంజేపల్లికి చెందిన శివారెడ్డి తనకు డబ్బులు అవసరముండి బత్తలపల్లిలోని కార్పొరేషన్ బ్యాంకు వద్దనున్న ఏటీఎం కేంద్రానికి వెళ్లాడు. అయితే డబ్బు డ్రా చేయడం తెలీక ఇబ్బంది పడుతుండటంతో ఓ అపరిచిత వ్యక్తి అక్కడకు వచ్చాడు. అతడిని శివారెడ్డి సాయం చేయాలని కోరాడు. తొలుత రూ.10 వేలు తీసుకున్నాడు. అనంతరం మరో రూ.5వేలు కావాలని అడగగా డబ్బులు తీసిన తర్వాత ఏటీఎంను మార్చి ఇచ్చాడు. అనంతరం ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత అపరిచిత వ్యక్తి కదిరి రోడ్డులోని పెట్రోలు బంకులో సిబ్బందితో కుమ్మక్కై స్వైప్ మిషన్ ద్వారా వారి ఖాతాలోకి నగదు ట్రాన్స్ఫర్ చేసి రూ.25వేలు, మరో చోట రూ.5వేలు డ్రా చేసుకున్నాడు. ఈ సమాచారం శివారెడ్డి సెల్‌కు మెసేజ్ వచ్చింది. సందేహం వచ్చి తనవద్దనున్న ఏటీఎంను పరిశీలించగా.. మారిపోయినట్లు గుర్తించి తెలుసుకుని వెంటనే బత్తలపల్లి పోలీసులను ఆశ్రయించారు. అయితే వారు ఫిర్యాదు స్వీకరించకుండా నిర్లక్ష్యంగా సమాధానమివ్వడంతో చేసేదిలేక వెనుదిరిగివచ్చాడు. చివరకు తాడిమర్రి మండలం ఏకపాదంపల్లికి చెందిన టీడీపీ నాయకులు ధనుంజయ వచ్చి పోలీసులతో మాట్లాడితేగానీ కేసు నమోదు చేయలేదు. శుక్రవారం కేసు నమోదు చేసి డబ్బులు ఎక్కడెక్కడ డ్రా చేసిందీ పరిశీలించారు. బత్తలపల్లి పెట్రోలు బంకు వద్దకు వెళ్లి సీసీ కెమెరాలలో నమోదైన ఫుటేజీలను పరిశీలించారు. -
పెంపుడు కుక్క బీభత్సం
బత్తలపల్లి : బత్తలపల్లిలో ఓ పెంపుడు కుక్క బీభత్సం సృష్టించింది. మండలంలోని గంటాపురానికి చెందిన జాంపుల చంద్రమోహన్ బత్తలపల్లిలో లారీ ట్రాన్స్పోర్ట్ సప్లయ్ ఆఫీసు పెట్టుకున్నారు. ఆయన పెంపుడు కుక్క గురువారం సాయంత్రం ఇంటి కాంపౌండ్‌లో నుంచి తప్పించుకుంది. అంతటితో ఆగక ఊరి కుక్కలను ఐదింటిని కొరికి చంపింది. విషయం తెలుసుకున్న యజమాని దాన్ని కట్టేసే ప్రయత్నం చేయగా అతనిపైనా దాడి చేసి కరిచింది. వీపు, చేతులు కొరకడంతో తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. -
పే...ద్ద గంజి గడ్డ
బత్తలపల్లి : మాములుగా గంజిగడ్డలు(చిలకల దుంప) కేజీ వరకు సైజు ఉంటాయి. అలాంటిది ఓ రైతు పొలంలో పది కేజీలు ఒక గంజిగడ్డ పండింది. బత్తలపల్లి మండలంలోని చెన్నరాయపట్నంలోని లింగమయ్య పొలంలో ఈ గంజి గడ్డ పండింది. -
రైతులను విస్మరించిన ముఖ్యమంత్రి
– వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి బత్తలపల్లి : వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన వేరుశనగ రైతులను ముఖ్యమంత్రి విస్మరించారని వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గంటాపురంలో ఎండిపోయి, దిగుబడిలేని వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. బాధిత రైతు నారాయణస్వామితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించినప్పుడు వేరుశనగ పంటలు ఎండకుండా రెయిన్ గన్లు తానే కనిపెట్టినట్లు షో చేశారని,రెయిన్ గన్లు అన్నీ ఫెయిల్ అయ్యాయని, ఆయన ఏమీ కనిపెట్టలేదని, కరువును మాత్రం కనిపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రతి ఎకరాకు రూ.20 వేలు ఇన్పుట్ సబ్సిడీ, బీమా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.170 కోట్లు ఖర్చు పెట్టి రైయిన్‌గన్‌లను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇంటిలో భద్రపరుచుకున్నారన్నారు. వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, అప్రాచ్చెరువు ఈశ్వర్‌రెడ్డి, బత్తలపల్లి, ధర్మవరం మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ బస్సును ఢీకొని యువకుడు మృతి
బత్తలపల్లె (అనంతపురం) : మలుపు తిరుగుతున్న బస్సును వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టి ఓ యువకుడు మృతి చెందాడు. అనంతపురం జిల్లా బత్తలపల్లె మండలం రాఘవంపల్లె గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు నగరం భరత్‌నగర్‌కు చెందిన ప్రమోద్(25) మంగళవారం సాయంత్రం తన బైక్‌పై వెళ్తూ మలుపు తిరుగుతున్న ప్రైవేట్ స్కూలు బస్సును వెనుక నుంచి ఢీ కొట్టాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలతో ప్రమోద్ అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఎస్సై హేమంత్ కుమార్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.