రైతులను విస్మరించిన ముఖ్యమంత్రి
– వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి
బత్తలపల్లి : వర్షాభావంతో తీవ్రంగా నష్టపోయిన వేరుశనగ రైతులను ముఖ్యమంత్రి విస్మరించారని వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి విమర్శించారు. వారికి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని గంటాపురంలో ఎండిపోయి, దిగుబడిలేని వేరుశనగ పంటలను ఆయన పరిశీలించారు. బాధిత రైతు నారాయణస్వామితో మాట్లాడారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబునాయుడు జిల్లాలో పర్యటించినప్పుడు వేరుశనగ పంటలు ఎండకుండా రెయిన్ గన్‌లు తానే కనిపెట్టినట్లు షో చేశారని,రెయిన్ గన్‌లు అన్నీ ఫెయిల్ అయ్యాయని, ఆయన ఏమీ కనిపెట్టలేదని, కరువును మాత్రం కనిపెట్టారని ఆయన ఎద్దేవా చేశారు.
ప్రతి ఎకరాకు రూ.20 వేలు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ.170 కోట్లు ఖర్చు పెట్టి రైయిన్‌గన్‌లను తీసుకువచ్చి టీడీపీ కార్యకర్తలు, నాయకుల ఇంటిలో భద్రపరుచుకున్నారన్నారు. వేరుశనగకు ఫసల్ బీమా వర్తింపజేయకుంటే రైతుల పక్షాన వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. జిల్లా అధికార ప్రతినిధి గుర్రం శ్రీనివాసరెడ్డి, అప్రాచ్చెరువు ఈశ్వర్‌రెడ్డి, బత్తలపల్లి, ధర్మవరం మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.